08-07-2025 11:10:16 PM
పిల్లలతో కూర్చొని పాఠాలు విన్న జాయింట్ కలెక్టర్..
ఖమ్మం (విజయక్రాంతి): ఒకప్పుడు మేము ఇలా క్రింద కూర్చొనే పాఠాలు విన్నామని, పిల్లలతో నేలపై కూర్చొని ఖమ్మం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి(Joint Collector P. Srinivas Reddy) పాఠాలు విన్నారు. మంగళవారం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాల(Social Welfare Department Residential School)ను అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో డార్మెటరీ రూమ్, కిచెన్, పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విన్నారు. విద్యార్థులతో అదనపు కలెక్టర్ ఇంటరాక్ట్ అయ్యారు.
విద్య బోధన ఎలా జరుగుతుంది, హాస్టల్ లో భోజనం నాణ్యత, వసతులు ఉన్నాయా, పారిశుధ్యం ఎలా ఉంది, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందాయా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ బాగా చదువుకోవాలని, విద్య ద్వారా జీవితంలో మంచి మార్పులు సాధ్యం అవుతాయని, గొప్ప స్థాయికి చేరుకునేందుకు, ఒకనాడు మేము ఇలా క్రింద కూర్చొని పాఠాలు విన్నవాళ్ళమే అని, నేడు ఇలా ఉన్నామని, మీరు మంచిగా చదువుకొని, మాకన్నా పెద్ద స్థాయిల్లో ఉండాలని, ఎంత బాగా చదివితే అంత మంచి అవకాశం లభిస్తుందని అన్నారు. విద్యార్థులు నాణ్యమైన ఆహారాన్ని స్వీకరించాలని, ప్రతిరోజు కొంత క్రీడలు వ్యాయామం కొరకు సమయం కేటాయించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.