calender_icon.png 12 November, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా వర్సిటీకి కొత్త చట్టం

03-12-2024 02:53:35 AM

  1. జీవో జారీ చేసి యాక్ట్‌ను రూపొందించని గత ప్రభుత్వం
  2. ఏ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేయాలన్న అంశంపై సందిగ్ధత
  3. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న సర్కారు 

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటైన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు లేకుండా నడుస్తున్నది. ఇప్పటివరకు యాక్ట్‌ను రూపొందించకపోవటంతో ఈ వర్సిటీ యూజీసీ గుర్తింపును పొందలేదు. దీంతో ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొన్నది. కోఠి మహిళా కాలేజీని తెలంగాణ విమెన్ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ గత ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

అప్పట్లో తెలంగాణ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఏప్రిల్‌లో జీవోను సైతం జారీ చేయడంతో విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీదే సర్టిఫికెట్లు జారీచేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేరును వీరనారి ఐలమ్మ మహిళా వర్సిటీగా మార్చి ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్ సూర్యాధనుంజయ్‌ను నియమించారు. ఇంతచేసి ఏడాది గడిచినా యాక్ట్‌ను రూపొందించకపోవడంతో వర్సిటీ యూజీసీ గుర్తింపునకు నోచుకోలేకపోయింది.

ఏ పేరుతో ఇవ్వాలి?

ఈ వర్సిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న వారికి ఏ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేయాలన్న అంశంపై సందిగ్ధిత నెలకొన్నది. కోఠి మహిళా కాలేజీ పేరు మీద ఇవ్వాలా? తెలంగాణ మహిళా వర్సిటీ పేరు మీద ఇవ్వాలా? వీరనారి చిట్యాల ఐలమ్మ మహిళా వర్సిటీ పేరు మీద ఇవ్వాలా? అన్న ప్రశ్నలు విశ్వవిద్యాలయ అధికారులను పీడిస్తున్నాయి.

దీనిపై స్పష్టత ఇవ్వాలని వర్సిటీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరగా.. ఈ అంశంపై సర్కారు ఉన్నత విద్యామండలి న్యాయసలహాను కోరింది. అయితే ఈ విషయంపై విద్యామండలి త్వరలోనే ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనుంది. కాగా యాక్ట్ లేకపోవడంతో కోఠి మహిళా కాలేజీ పేరుతోనే విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. 

యాక్ట్‌ను సవరించి..
విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది రెండేండ్లు గడిచినా.. యూజీసీ గుర్తింపులేనందున ఉస్మానియా మహిళా కళాశాల పేరుతోనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ విద్యార్థినులు గత శనివారం ఆందోళనకు దిగారు. వర్సిటీకి గుర్తింపు లేనందున తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ నెల 9న నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ తీర్మానం, ప్రభుత్వం జారీచేసిన జీవో ఆధారంగా విద్యాశాఖ వర్సిటీ యాక్ట్‌ను రూపొందించాలని యోచిస్తోంది. ఇందుకు పాత యాక్ట్‌ను సవరించి, అసెంబ్లీ ఆమోదం తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపించాలి. గవర్నర్ ఆమోదిస్తే యాక్ట్ అమల్లోకి వచ్చి వర్సిటీకి యూజీసీ గుర్తింపు లభించనుంది.