25-07-2025 01:57:45 AM
తీగలాగితే డొంక కదిలిన వైనం...
హుజూర్ నగర్,(మేళ్లచెరువు)జూలై 24: కృష్ణ పట్టేలో దొరికిన నకిలీ మద్యం ఇప్పుడు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నది అంటే ఎంత పెద్ద స్థాయిలో ఈ దందా జరుగుతుందో ఇట్టే తెలిసిపోతుంది...
ఇక వివరాలలోకి వెళితే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలంలోని రామాపురం గ్రామంలో నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే స్పిరిట్ తో నకిలీ మద్యం తయారుచేసే స్థావరంపై గత రెండు రోజుల క్రితమే రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు చేసి భారీగా నకిలీ మద్యం పట్టుకున్నారు...దీంతో నకిలీ మద్యంపై విచారణ చేపట్టిన అధికారులు కొందరిని అదుపులోకి తీసుకొని ముమ్మరంగా దర్యాప్తు చేశారు...
మేళ్లచెరువు మండలంలోని రామపురం గ్రామానికి చెందిన ఎ-1ముద్దాయిగా తప్పించుకొని తిరుగుతున్న తోట శివశంకర్ స్నేహితుడైన రంగుశెట్టి సైదేశ్వరరావును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేశారు..ఈ దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలిన వైనం అన్నట్లుగా సైదేశ్వరరావు తన వ్యవసాయ భూమిలో దాచిన మద్యాన్ని జెసిబితో తవ్వి భూమిలో పాతిపెట్టిన రెండుచోట్ల 250 ఎంసీ మద్యం కాటన్ లను ట్రాక్టర్ సహాయంతో తీసుకువెళ్లిన విషయాన్ని పోలీసుల ముందు బయటపెట్టారు. దీంతో ఎక్సైజ్ అధికారులు భూమిలో దాచిపెట్టిన నకిలీ మద్యాన్ని జెసిబి సహాయంతో వెలికి తీశారు.
ఈ మద్యాన్ని దాచిపెట్టేందుకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మద్యంతో పాటు జెసిబిని మద్యం తీసుకువచ్చిన రెండు ట్రాక్టర్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ నకిలీ మద్యాన్ని కృష్ణ పట్టెకు ఆనుకొని ఉన్న పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని,స్థానిక సంస్థల ఎన్నికలలో ఉపయోగించాలని తయారు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిఇలా ఉండగా ఇదే గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ఇంట్లో 6 కాటన్ల మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు.ఈ దాడులలో ఎక్సైజ్ సూపరిడెంట్ లక్ష్మనాయక్, హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి, అధికారులు,పాల్గొన్నారు.