05-12-2025 01:10:55 PM
ఎల్బీనగర్: వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో గురువారం దారుణం చోటుచేసుకుంది. సకాలంలో వైద్యులు వైద్య చికిత్స అందించక పోవడంతో ప్రసవ సమయంలో శిశువు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం సూరారం గ్రామానికి చెందిన షేక్ హైమత్ అలీ, సమీనా దంపతులు ప్రసవం కోసం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానకు ఈ నెల 2వ తేదీన వచ్చారు. వైద్యులు పరీక్షించి, సాధారణ ప్రసవం చేస్తామని చెప్పారు. కాగా, పురిటి నొప్పులు అధికం కావడంతో ఆపరేషన్ చేసి ప్రసవం చేయాలని సమీనా కుటుంబ సభ్యులు వైద్యులను కోరారు.
సాధారణ ప్రసవమే చేస్తామని వైద్యసిబ్బంది స్పష్టం చేశారు. అయితే, గురువారం రాత్రి నొప్పులు అధికం కావడంతో వైద్యసిబ్బంది ప్రసవం చేశారు. సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో అప్పుడు సిజేరియన్ చేసి, శిశువును బయటకు తీశారు. అదే సమయంలో శిశువు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని శుక్రవారం ఉదయం దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హైమత్ అలీ, సమీనా దంపతులు మాట్లాడుతూ... వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని అన్నారు. ఆపరేషన్ చేస్తే శిశువు బతికేవాడని, సాధారణ ప్రసవం చేస్తామని వైద్యులు మెండికేశారని, ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణమని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతో మా ఇంట్లో విషాదం నెలకొందన్నారు. ఈ ఘటనపై వైద్యాధికారులు మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, శిశువు మృతిపై విచారణ చేయిస్తామన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.