ఇంధన కొరతపై వస్తున్న వార్తలు కేవలం దుష్ప్రచారం మాత్రమే
* బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ
హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంధన (పెట్రోల్, డీజిల్) కొరత ఉందంటూ సోషల్ మీడియాలో కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని బిజెపి రాష్ట్ర నాయకురాలు రావు పద్మా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా, రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కేవలం తప్పుడు ప్రచారాల వల్ల ప్రజలు ఒక్కసారిగా బంకుల వద్దకు రావడంతో తాత్కాలికంగా రద్దీ ఏర్పడుతోంది తప్ప, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రవాణా వ్యవస్థలో ఎక్కడా ఆటంకాలు కలగకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, అవసరమైన మేరకు మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు. రద్దీని పెంచి అనవసరమైన గందరగోళానికి దారి తీయవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై దృష్టి సారించాలని, ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు.




