07-08-2025 12:00:00 AM
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- ఇనగంటి వెంకట్రావు ఒక తరం ఒక తరం జర్నలిస్టులకు స్ఫూర్తి
- తెలంగాణ రాష్ట్ర ఎస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి
- ‘విలీనం-విభజన’- ’మన ముఖ్య మంత్రులు’ పుస్తకం ఆవిష్కరణ
ముషీరాబాద్, ఆగస్టు 5(విజయక్రాంతి): పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని, సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ సంపాదకులు ఇనగంటి వెంకట్రావు రాసిన ’విలీనం-విభజన మన ముఖ్య మం త్రులు’ పుస్తకాన్ని ముఖ్య అతిధిగా వెంకయ్య నాయుడు హాజరై మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, బండారు శ్రీనివాస్ లతో కలసి ఆవిష్కరించి మాట్లాడారు.
’విలీనం-విభజన’- ’మన ముఖ్య మంత్రులు’ అనే పుస్తకాన్ని నేటితరం యువత తప్పని సరిగా చదవాలని సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురుంచి అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. మన వ్యూస్ న్యూస్ ప్రెజెం ట్ చేయకూడదని, దాని కోసమే రాసుకోవడానికి కాలమ్స్ ఉన్నాయని, అందులో వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చన్నారు. భాష విషయంలో రాజకీయ నాయకుల తీరు మారాలని, చాలా హుందాగా ప్రవర్తించాలని సూచించారు. చాలా మంది జర్నలి స్టులు కొత్తగా యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పాత్రికేయంలో భాష చాలా ముఖ్యం అన్నారు.
జీవితంలో రెండు సార్లు కంటతడి పెట్టానని అన్నారు. ఒకటి అమ్మ గుర్తుకు వచ్చినపుడు, తాను అమ్మను చూడలేదని అన్నారు. రెండోది పార్లమెంటరి పార్టీ సమావేశానికి పిలిచి ఉప రాష్ట్రపతిగా చేసినపుడని గుర్తు చేసుకున్నారు. తనకు రాజకీయాల్లో నుంచి రావడం ఇష్టం లేదని తెలిపారు. తాను ఉప రాష్ట్రపతిగా దిగిపోయిన నుంచి ఇప్పటి వరకు పార్టీ ఆఫీస్ గుమ్మం తొక్కలేదని అన్నారు.
ఉప రాష్ట్రపతిగా రిటైర్డ్ అయ్యాక యువత కోసం రాజకీయాలు మాట్లాడుతున్నానని తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇనగంటి వెంకట్రావు ఒక తరం జర్నలిస్ట్ లకు స్ఫూర్తి అన్నారు. ఆయన రచించిన విలీనం-విభజన పుస్తకం అని అనడం కంటే కూడా మంచి నవల అని చెప్పొచ్చన్నారు. బీజేపీ కేంద్ర పార్టీకి అధ్యక్షులుగా పనిచేయడం వెంకయ్య నాయుడు ప్రతిభకు కొలమానం అన్నారు. వెంకయ్య నాయుడు అనేక పదవులు చేపట్టి వాటికే వన్నె తెచ్చారని అన్నారు. నాటి అసెంబ్లీ సమావేశాల్లో జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వాగ్దాటితో మాట్లాడి శభాష్ అనిపించే వారని గుర్తు చేశారు.