11-08-2025 01:27:06 PM
కరీంనగర్,(విజయక్రాంతి): మేడిగడ్డ వద్దనీటి నిల్వ ఉంచవచ్చా, ఉపయోగించుకోవచ్చా అనే అంశంపై డ్యాం సేఫ్టీ అథారిటీవారు నిర్ధారణ చేసినవిధంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని, ఈ అంశంపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. సోమవారం కరీంనగర్ లో సుడా నూతన కార్యాలయ భవన శంకుస్థాపన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలతో కలిసి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మేడిగడ్డ(Medigadda Barrage) లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు.
మా మేనిఫెస్టోలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పామని, కమిషన్ వేశామని, కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై మాకు నమ్మకం ఉందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను శానసభలో ఆమోదించి గవర్నర్ కు పంపించామని, ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద, కేంద్రం వద్ద పెండింగ్లో ఉందన్నారు. బీజేపీకి చెందిన 8 మంది పార్లమెంట్ సభ్యులు బీసీ బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. ఇటు బీజేపీ కాని, అటు బీఆర్ఎస్ కాని బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని, జంతర్మంతర్ వద్ద మా నిరసన ధర్నాకు మద్దతు పలకలేదని పేర్కొంటూ ఈరోజు ఈ అంశంపై ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరిని విచారణకు పిలవాలనేది సిట్ అధికారులు నిర్ణయిస్తారని, మాకు సంబంధం లేదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఎమ్మెల్యేలపై నిర్ణయం స్పీకర్ గారిడేనన్నారు. హైదరాబాద్, కరీంనగర్ ఇండస్ట్రియల్ కారిడార్ పై ప్రభుత్వం ముందుకెళ్తుందని, పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నామని, మధ్యలో ఆగిపోయిన మానేరు రివర్ ఫ్రంట్పై సమీక్ష జరిపి ముందుకెళ్తామని పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలు లేక ఇండ్ల పంపిణీ ఆగిపోయిన అంశంపై మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లనిర్మాణం, ఇందిరమ్మ కమిటీల ఆధారంగా త్వరలోనే జరిపిస్తామని స్పష్టత ఇచ్చారు.