19 March, 2026 | 3:14 AM

ఆయిల్ పామ్ పరిశ్రమ సాధనే లక్ష్యంగా.. పట్టుదలతో ప్రభుత్వ సలహాదారు కృషి

19-03-2026 01:31 AM
  1. అనువైన స్థలం కోసం కలెక్టర్‌తో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన 

ఫ్యాక్టరీ ఏర్పాటైతే  పారిశ్రామికంగా మరింత పురోగతి 

నిజామాబాద్, మార్చి 18(విజయ క్రాంతి) : వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాను సాగు రంగంలో మరింతగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతాంగానికి లాభాల సిరి అందించాలనే తాపత్రయంతో ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి, బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తనదైన శైలిలో కృషి సాగిస్తున్నారు. ఇందులో భాగంగా అధిక లాభాలను అందిస్తూ, అనేక ప్రయోజనాలు సమకూర్చే ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించేలా జిల్లా యంత్రాంగం తోడ్పాటుతో ప్రత్యేక చొరవ చూపుతున్నారు.

ఫలితంగా జిల్లాలో సుమారు 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగు జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం ఆయిల్ పామ్ ఇండస్ట్రీ నెలకొల్పేందుకు అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.

సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. స్థల నిర్ధారణ జరిగిన వెంటనే ఆయిల్ పామ్ ఫాక్టరీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అన్నారు.    ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగిందని, దానిని జిల్లాకు మంజూరు చేసేందుకు సంసిద్ధత తెలిపారని అన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా అనువైన స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు.  దేశ వ్యాప్తంగా స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణంలోపే ఈ పంట సాగు చేస్తున్నారని అన్నారు. 

ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం  రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని, ఇన్ పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. ఆయిల్ పామ్ మొక్కలకు అయ్యే వ్యయంలో కూడా అధిక మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ సబ్సిడీ రూపంలో కంపెనీలకు చెల్లిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదని భరోసా కల్పించారు. 

ఎకరం విస్తీర్ణంలో సుమారు పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, అంతర పంట వేసుకొని అదనపు లాభాలను సైతం పొందవచ్చని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు.  స్థల పరిశీలన జరిపిన వారిలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, రమణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.