17-07-2025 01:50:56 AM
ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల పరిశీలన
మేడ్చల్, జూలై 16 (విజయక్రాంతి)/మేడిపల్లి: ఉప్పల్ ఫ్లైఓవర్‌ను దసరాకు ప్రారంభిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మాణంలో ఉన్న 6.8 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ పనులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు 2017లో ప్రారంభమైందని, అనివార్య కారణాలవల్ల ఇప్పటికి పూర్తి కాలేద న్నారు. ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం లేదని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అన్నారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఎప్పటికప్పుడు ఫ్లైఓవర్ పనుల వేగవంతంపై తనతో మాట్లాడారని చెప్పారు.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ ఘడ్కరితో మాట్లాడి దీనికి సంబంధించిన చిక్కులు పరిష్కరించినట్టు మంత్రి తెలిపారు. పాత కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ఎలివేటెడ్ కారిడార్ ఇదేనన్నారు.
అలాగే జిహెచ్‌ఎంసి పరిధిలో ఉప్పల్ నుంచి డిఎస్‌ఎల్ మాల్ వరకు నిర్మించాల్సిన 1.5 కిలోమీటర్ పొడవైన ఫ్లుఓవర్ పనులపై మంత్రి, జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశిం చారు. జిహెచ్‌ఎంసి కమిషనర్, ఈ ఎన్ సి, సీఈలతో కలిసి శుక్రవారం సచివాలయం లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆయనవెంట ఆర్ అండ్ బి జాతీయ రహదారి విభాగం ఎస్సీ ధర్మారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.