10-08-2024 03:38:54 AM
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్‌చైర్మన్ ప్రొపెసర్ మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంక టేశ్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తంగా 94.57 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 45 సబ్జెక్టులకు సంబంధించిన జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 73,342 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,765 మం ది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 61,246 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఉన్నత విద్యలో అమ్మాయిలు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. డిగ్రీ, బీఎడ్ ప్రవేశాలతోపాటు యూనివర్సిటీ విద్యవైపు వారు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతకాలంగా అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా డిగ్రీ, పీజీ వరకు వారే మంచి ఫలితాలు సాధిస్తున్నా రు. ప్రభుత్వ పథకాలతో పాటు తల్లిదండ్రు లు కూడా ప్రోత్సహిస్తున్నారు. శుక్రవారం విడుదల చేసి సీపీగెట్ ఫలితాల్లో అర్హత సాధించిన వారిలో అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది.
పరీక్షకు అబ్బాయిలు 24,935 మంది, అమ్మాయిలు 48,407 మంది రిజస్టర్ చేసుకున్నారు. వీరిలో అబ్బాయిలు 20,569 మంది ఉత్తీర్ణత సాధిస్తే, అమ్మాయిలు 40,677 మంది అర్హత సాధించారు. 2023 విద్యాసంవత్సరంలోనూ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 47,211 సీట్లలో 20,519 సీట్లు భర్తీ అయ్యాయి. అయితే ఇందులో 5,412 సీట్లను అబ్బాయిలకు కేటాయించగా.. 15,107 సీట్లు అమ్మాయిలే దక్కించుకున్నారు.
12 నుంచి కౌన్సిలింగ్
ఈ నెల 12 నుంచి సీపీగెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 8 యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో పీజీ కోర్సులు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఎస్‌ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ తోపాటు మొత్తం 45 కోర్సుల్లో 2024 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఈనెల 12 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. 26న వెరిఫికేషన్ వివరాలను పొందుపర్చనున్నారు.
27 నుంచి 30 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. మొదటి విడుత సీట్లను సెప్టెంబర్ 4న కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో సెప్టెంబర్ 9వ తేదీలోపు రిపోర్టింగ్ చేయాలి. అదేనెల 15 నుంచి రెండో విడుత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఉన్నత విద్యలో అమ్మాయిలు గత కొన్నేళ్లుగా రాణిస్తున్నారని లింబాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.