calender_icon.png 17 July, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశీయులపై నిఘా పెట్టాం

10-08-2024 04:36:49 AM

  1. అక్రమంగా హైదరాబాద్ వస్తే కేంద్రం ఆదేశాల మేరకు చర్యలు 
  2. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హ్యాకథాన్ డీజీపీ జితేందర్ వెల్లడి 
  3. హాజరైన టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్, డిప్యూటీ చీఫ్ సెక్రటరీ భవేశ్ మిశ్రా  

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిఘాను పటిష్టం చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా వస్తే.. కేంద్రం ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ వాసులపైనా కూడా నిఘాను ఉంచామని వివరించారు. శుక్రవారం తెలంగాణ పొలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ), సైబర్ సెక్యూరిటీ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీసీఓఈ), డేటా సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ది గ్రేట్ యాప్‌సెక్ హ్యాకథాన్  కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ హ్యాకథాన్‌లో దాదాపు 20 దేశాల నుంచి 10 వేల మంది వరకు పాల్గొన్నారని వివరించారు. రాష్ట్ర ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆధునిక సాంకేతిక యుగంలో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా కీలకంగా మారిందన్నారు. రాష్ట్రంలో సైబర్ బ్యూరో ఏర్పడినప్పటి నుంచి చాలా కేసులను ఛేదించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు రూ.150 కోట్లను సైబర్ బాధితులకు చెల్లించామన్నారు.  

నిమిషానికి రెండు సైబర్ నేరాలు: డిప్యూటీ చీఫ్ సెక్రటరీ భవేశ్ మిశ్రా

గతేడాది మొత్తం 11 లక్షల సైబర్ నేరాలు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెబుతోందని ఐఏఎస్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, డిప్యూటీ చీఫ్ సెక్రటరీ భవేశ్ మిశ్రా చెప్పారు. దేశంలో ప్రతి నిమిషానికి రెండు కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించారు. గతేడాది మొత్తం రూ.7,500 కోట్ల వరకు సైబర్ ఫ్రాడ్ జరిగినట్లు చెప్పుకొచ్చారు. 

70 శాతం చదువుకున్నవారే: టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ 

ఈ హ్యాకథాన్ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో మైలురాయిగా నిలుస్తుందని సీనియర్ ఐపీఎస్, టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. సైబర్ నేరాల్లో దాదాపు 70శాతం మంది చదువుకున్నవారే ఉన్నారని వెల్లడించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హ్యాకర్లను హైర్ చేసుకోనున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఇండియా, వరల్డ్‌లో టాప్ చొప్పున హ్యాకర్లను ఎంపిక చేసి వారితో కలిసి పని చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు.

పలువురికి చెక్కులు అందజేత.. 

టీజీసీఎస్‌బీ లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు సైబర్ మోసానికి గురైన బాధితులకు రూ.85.05 కోట్లను రీఫండ్ చేశారు. తద్వారా తెలంగాణ సైబర్ బ్యూరో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ హ్యాకథాన్ కార్యక్రమంలో పలువురు బాధితులకు రీఫండ్ చెక్కులను అందజేశారు. దక్షిణామూర్తి అనే వ్యక్తికి రూ.1.5 కోట్లు, జీ ప్రభాకర్‌కు రూ.26 లక్షలు, ఏ శ్రీనివాస్‌కు రూ.6 లక్షలు, వెంకట్ ఉదయ్ కిరణ్‌కు రూ.5 లక్షలు, ప్రసన్నకుమార్ అనే వ్యక్తికి రూ.2.5 లక్షల చెక్కులను డీజీపీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేంద్ర ఎన్‌ఎస్‌సీఎస్, ఐటీ ప్రతినిధి నరేంద్ర నాథ్, డీజీసీఎస్‌బీ ఎస్పీ హర్షవర్దన్, సైబర్ క్రైమ్ ఎస్పీ దేవేందర్ సింగ్, డీఎస్‌సీఐ డాక్టర్ శ్రీరామ్, సీసీఓఈ సాయి కృష్ణ పాల్గొన్నారు.