10-08-2024 03:32:16 AM
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలని, సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణ త్యాగం చేశారని గుర్తుచేశారు.
బడిలో టీచర్‌గా పనిచేస్తూ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి పదవి చేపట్టారని చెప్పారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆఫ్రికా తరువాత గిరిజనులు అత్యధికంగా భారతదేశంలోనే ఉన్నారని తెలిపారు. అన్ని రంగాల్లో గిరిజనులు ముందువరుసలో ఉండాలనేది తమ ఆకాంక్ష అని, మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు అరకు కాఫీ రుచి చూపించామని వెల్లడించారు.
తమ ప్రభుత్వ హయాంలో ఏటా ఆదివాసీ దినోతవ్సవం ఘనంగా నిర్వహించామని, గత ఐదేళ్లలో ఈ దినోత్సవం గురించి పట్టించుకున్న పాలకుడు లేడని విమర్శించారు. ఆదివాసీలంటే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అని పేర్కొన్నా రు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తుండగా, కూటమి తరఫున అభ్యర్థిని బరిలో దింపాలని పార్టీ సన్నాహాలు చేస్తుంది.