20-01-2026 03:58:33 PM
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... నబిన్‌ను ఒక మిలీనియల్ నాయకుడిగా అభివర్ణించి, సంస్థలో ఆయన ప్రస్థానాన్ని ప్రశంసించారు. ఆర్థిక, సాంకేతిక రంగాలలో భారతదేశం సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రత్యక్షంగా చూసిన తరానికి చెందిన వ్యక్తి ఇప్పుడు బీజేపీకి నాయకత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు.
నవీన్ వార్తల కోసం రేడియోపై ఆధారపడిన కాలంలో పెరిగారని, అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాధనాలకు సజావుగా అలవాటుపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త బాధ్యతకు గాను ఆయనకు అభినందనలు తెలుపుతూ పార్టీకి సంబంధించిన విషయాలలో నితిన్ నబిన్ ఇప్పుడు తన బాస్ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడి పాత్ర సంస్థకు మాత్రమే పరిమితం కాదని, జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సమర్థవంతమైన సమన్వయాన్ని నిర్ధారించడం కూడా అందులో భాగమన్నారు.
తన ప్రసంగంలో, మోదీ అమిత్ షా, జేపీ నడ్డా సహా మాజీ బీజేపీ అధ్యక్షుల సేవలను కూడా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పార్టీ ఉనికిని బలోపేతం చేయడంలో, కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో వారు సహాయపడ్డారని ఆయన కొనియాడారు. నిర్వివాదంగా ఎన్నికైన నితిన్ నబిన్, జేపీ నడ్డా తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బీహార్‌కు చెందిన సీనియర్ నాయకుడైన ఆయన, ఐదుసార్లు బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మాజీ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తన సంస్థాగత నైపుణ్యాలకు, పరిపాలనా అనుభవానికి ప్రసిద్ధి చెందారు.