18 April, 2026 | 2:20 AM

మట్టికట్ట వద్దు.. ఫ్లైఓవర్ నిర్మించాలి

18-04-2026 12:43 AM

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 

చౌటుప్పల్, ఏప్రిల్ 17 : చౌటుప్పల్ మున్సిపాలిటీ లో జాతీయ రహదారి ఎన్ హెచ్ 65పై ప్రస్తుతం ప్రతిపాదించిన మట్టి కట్ట నిర్మాణాన్ని రద్దు చేసి, దానికి బదులుగా పిల్లర్లపై ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని జాతీయ రహదారుల అథారిటీ (ఎన్ హెచ్ ఏఐ) ప్రాంతీయ కార్యాలయంలో డైరెక్టర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మట్టి కట్ట వల్ల స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, వ్యాపార సముదాయాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక పద్ధతిలో పిల్లర్లతో కూడిన ఫ్లైఓవర్ నిర్మిస్తేనే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.రోడ్డు నిర్మాణంతో పాటు ఎన్ హెచ్ 65 పక్కన ఉన్న డ్రైనేజీ విస్తీర్ణాన్ని పెంచాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చింతల దామోదర్ రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, తాడూరి పరమేష్, గుండబోయిన వెంకటస్వామి, చెవగోని మహేష్, బిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.