08-01-2026 01:30:43 AM
మహబూబ్ నగర్, జనవరి 7(విజయక్రాంతి): ఇకపై ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయం లోనికి ప్రవేశం లేదు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి నిర్ణయం మేరకు కలెక్టరేట్ లోకి హెల్మెట్ లేకుండా లోనికి ప్రవేశించే ద్విచక్ర వాహనదారులను గత రెండు రోజులుగా అనుమతించడం లేదు.రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద రవాణా శాఖ సిబ్బంది తో కలిసి పర్యవేక్షణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1 నుండి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు పాటింపు, రోడ్డు భద్రత పై అవగాహన కలిగించేందుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ లేని కారణంగా తలకు ప్రమాదం సంభవించి అనేక మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పక ధరించాలని,హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలకు రక్షణగా ఉంటుందని తెలిపారు.
కలెక్టరేట్ కు ద్విచక్ర వాహనంపై వచ్చే అధికారులు,ఉద్యోగులు,ప్రజలు తప్పక హెల్మెట్ ధరించి రావాలని ,అదే విధంగా నాలుగు చక్రాల వాహన దారులు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు..కలెక్టర్ కార్యాలయం లో పని చేసే ఉద్యోగులు,సిబ్బంది అందరికీ ఆదర్శంగా ఉండాలని,ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా రవాణా అధికారి రఘు, కలెక్టరేట్ పరిపాలన అధికారి సువర్ణ రాజ్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, ఆర్టిఏ సభ్యులు సలీం, రవాణా శాఖ, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు.