11 August, 2026 | 2:48 AM

వడ్లు లేవు.. బియ్యం బాకీ!

11-08-2026 12:01 AM
  1. ఆరు సీజన్లుగా సీఎంఆర్ బకాయిలు
  2. నిర్మల్ జిల్లాలో భారీగా పెండింగ్
  3. లెక్క తేలని రూ.250 కోట్ల విలువైన బియ్యం  
  4. మిల్లర్ల మాయాజాలం
  5. నోటీసులతో అధికారుల కాలయాపన   
  6. రికవరీపై స్పష్టత కరువు

నిర్మల్ ఆగస్టు 10 ( విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వ్యవహారం అంతుచిక్కడం లేదు. మిల్లర్లు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బియ్యం ఆరు సీజన్లుగా పెండింగ్‌లో ఉండగా, మిల్లుల్లో వడ్లు కూడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

బియ్యం రికవరీపై అధికారులు నోటీసులతో కాలయాపన చేస్తుండగా, రూ.250 కోట్ల విలువైన బియ్యం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 54 రైస్ మిల్లు ఉండగా సగం మిల్లులు సీఎంఆర్ బకాయి పడినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రతి సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ఇచ్చిన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మార్చి క్వింటాకు 67 కేజీల లెక్కన ప్రభుత్వానికి 60 రోజుల్లో తిరిగి అందజేయాల్సి ఉంటుంది. కానీ, ఆరు సీజన్లు గడిచినా మిల్లర్లు నిర్లక్ష్యం వీడటం లేదు.   

2022 నుంచి పెండింగ్ సీఎంఆర్ ఇలా..

2022 వానాకాం, యాసంగి సీజన్లు మొదలుకొని 205 యాసంగి వరకు నిర్మల్ జిల్లాలో మిల్లర్లు దాదాపు రూ.250 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వానికి బకాయి పడ్డారు. 2022 యాసంగిలో మిల్లర్లకు 1,58 566.320 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి 1, 0 6, 831. 956 మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా కేవలం 6,303.495 మెట్రిక్ టన్నులు మాత్రం ఇచ్చారు. ఇంకా 1,00,528.461 మెట్రిక్ టన్నుల బకాయి పడ్డారు. 2023- వానాకాలం 1,42, 750. 080 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 95,942.783 మెట్రిక్ టన్నులు తిరిగి ఇవ్వాల్సి ఉంది.

ఇందులో 89, 995. 294 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించగా, ఇంకా 5 947.429 మెట్రిక్ టన్నుల ధాన్యం పెండింగ్ ఉంది. యాసంగిలో 1,08,321.640 మెట్రిక్ టన్నులు ఇవ్వగా 82,630.010 మెట్రిక్ టన్నుల బియ్యం  ఇవ్వాల్సి ఉంది. కానీ 63,324.674 టన్నుల బియ్యం అప్పగించిన మిల్లర్లు ఇంకా 18,995.336 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉన్నారు. 2024 -వానాకాలం  1,14,185.081 మెట్రిక్ టన్నులకు గాను 76,866.738 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.

అందులో 61,221.260 మెట్రిక్ టన్నులు అప్పగించగా 15,645.679 మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉంది. యాసంగిలో 1, 53, 949.120 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు కేటాయించారు. 1, 03, 590.373 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా, 35,889.039 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 67,701.334 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్ ఉంది. 2025 వానాకాలం 5,93,960 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించగా 3,99,109 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది.

ఇందులో 13,972.737 మెట్రిక్ టన్నులు ఇవ్వగా, ఇంకా 25,937.422 మెట్రిక్ టన్నులు బకాయి ఉంది. యాసంగిలో 1,71,872.600 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 1,15,651.883 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఇందులో 5,720.000 టన్నుల బియ్యం ఇవ్వగా, 1.09,931.583 మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉంది. ముఖ్యంగా 2023 వానాకాలం యాసంగి, 2024- వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ పెద్ద మొత్తంలో మిల్లర్లు బకాయి పడ్డారు. తనిఖీల్లో మిల్లుల్లో వడ్లు కూడా లేకపోవడంతో బియ్యం వచ్చే అవకాశాలు తక్కువేనని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.    

పురోగతి లేని కేసులు

నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ తిరిగి ఇవ్వని 34 మిల్లులపై రికవరీ యాక్ట్ కింద అధికారులు కేసులు నమోదు చేసినా పురోగతి కనిపించడం లేదు. మిల్లర్లకు నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది. మరోవైపు కొన్ని మిల్లుల ఆస్తి విలువ సీఎంఆర్  బియ్యం కంటే తక్కువ ఉండటం రికవరీపై అయోమయం నెలకొంది. 

సీఎంఆర్ బియ్యం రాబట్టుకునేందుకు తాజాగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, రెవెన్యూ కలెక్టర్ కిషోర్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, జిల్లా మేనేజర్ సుధాకర్ పర్యవేక్షణలో మిల్లుల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయినా కొందరు మిల్లర్లు మొండికేస్తూ  కొత్త వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని మిల్లుల ఆస్తి విలువ సీఎంఆర్  బియ్యం కంటే తక్కువ ఉండటం రికవరీపై అయోమయం నెలకొంది.  

రికవరీ యాక్ట్ నమోదు చేశాం

సీఎంఆర్ బకాయి పడ్డ మిల్లర్లు స్పందించకుంటే కఠిన చర్యలు తప్పవు. జిల్లా వ్యాప్తంగా 34 మిల్లులపై రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం కేటాయించిన ధాన్యం పక్కదారి పట్టకుండా మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. సకాలంలో, పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగించిన మిల్లర్లకు మాత్రమే తిరిగి ధాన్యం కేటాయింపులు చేయనున్నాం.    

 సివిల్ సప్లు డీఎం