17 August, 2026 | 7:52 PM

నాగారంలో మద్యం, మత్తు పదార్థాలకు నో

17-08-2026 05:19 PM

సెప్టెంబర్‌ 1 నుంచి మద్యం దుకాణాలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే రూ.50 వేల జరిమానా

మంథని, ఆగస్టు 17 (విజయక్రాంతి): మంథని మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో మద్యం, మత్తు పదార్థాల విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు గ్రామసభలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 15న నిర్వహించిన గ్రామసభలో పలు తీర్మానాలను ఆమోదించారు.

గ్రామపంచాయతీ పరిధిలో సెప్టెంబర్‌ 1, 2026 నుంచి ఎలాంటి మద్యం దుకాణాలు నిర్వహించరాదని గ్రామసభ తీర్మానించింది. అదేవిధంగా డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలను అనుమతి లేకుండా నిల్వ చేయడం, విక్రయించడం, పంపిణీ చేయడం పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై రూ.50 వేల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

గ్రామంలో మద్యం దుకాణాలు లేదా మత్తు పదార్థాల అక్రమ విక్రయాలపై సమాచారం అందించే వారికి రూ.5 వేల ప్రోత్సాహక నగదు బహుమతి అందజేయనున్నట్లు గ్రామపంచాయతీ ప్రకటించింది. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాగారం గ్రామ బెల్లంకొండ శ్రీదేవి సత్యనారాయణరెడ్డి, ఉపసర్పంచ్ ఎరుకల లలిత, వార్డు సభ్యులు బూడిద తిరుపతి, ఎరుకల రాజశేఖర్, దాసరి రవీందర్, బూడిద శ్రీకాంత్, జక్కుల భాగ్యలక్ష్మి, తోకల శైలజ, అనసూయ, సత్తమ్మ, గ్రామ వీఓ అధ్యక్షురాలు ఎరుకల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.