17 August, 2026 | 7:58 PM

కోమటిపల్లిలో రూ.2.50 లక్షలతో ఉచిత వాటర్ ప్లాంట్

17-08-2026 05:22 PM

ఎన్నికల హామీ మేరకు సొంత నిధులతో నిర్మాణం

ప్రారంభించిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి..

రామాయంపేట ఆగస్టు 17 (విజయక్రాంతి): రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి రెండో వార్డులో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో సుమారు రూ.2.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఉచిత నీటి శుద్ధీకరణ యంత్రాన్ని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సోమవారం ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సొంత నిధులతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ... ప్రజలకు స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావించానని, అందులో భాగంగానే సొంత నిధులతో వాటర్ ప్లాంట్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తానని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వార్డుకు ఉచిత వాటర్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై కోమటిపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం వార్డు కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్ ఆధ్వర్యంలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ  కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్ గౌడ్, కౌన్సిలర్లు మద్దెల మాధవి, రమేష్, చరిత, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కల్వకుంట సర్పంచ్ అందెకొండ రెడ్డి, రాజు యాదవ్, పాతూరు సిద్ధరాములు, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, శ్యామ్ రెడ్డి, హైమద్, మావురం రాజు, విద్యాకర్ తదితరులతో పాటు కోమటిపల్లి గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.