calender_icon.png 10 October, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ప్రక్రియ నోటీసు విడుదల..

09-10-2025 06:16:50 PM

వనపర్తి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వనపర్తి నియోజకవర్గంలోని 8 జడ్పీటీసీ, 71 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ నోటీస్ విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం ఉదయం జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి వనపర్తి మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ ఆర్. ఒ కార్యాలయాన్ని, చిట్యాల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ ఆర్. ఒ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను తనిఖీ చేశారు. మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించాల్సిన 8 జడ్పీటీసీ 71 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న  ఎన్నికలు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు.

అక్టోబర్ 9 నుండి 11 వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ప్రతిపాదన చేసే వ్యక్తి, నిర్ణిత రుసుము చెల్లించి నామినేషన్ వేసుకోవాలని సూచించారు.  అక్టోబర్ 12న స్క్రూటినీ నిర్వహించి సాయంత్రం 5.00 గంటలకు చెల్లుబాటు అయిన నామినేషన్ల జాబితా ప్రకటించడం జరుగుతుంది. అక్టోబర్ 13వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వచ్చిన అప్పిళ్ల ను అక్టోబర్ 14న పరిష్కరించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 15న సాయంత్రం 3.00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, అదేరోజు సాయంత్రం పోటీదారుల తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 23న ఎన్నికలు నిర్వహించి నవంబర్ 11న  ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించడం జరుగుతుందనీ తెలియజేశారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.