09-11-2025 12:53:25 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): “టీకాలు కేవలం చిన్నపిల్లలకు మాత్రమే వేసేవి కావు. జీవితాంతం ఆరోగ్య రక్షణకు సురక్షితమైన, ప్రభావవంతమైన సాధనం. నివారించదగ్గ అనేక వ్యాధుల నుంచి అవి రక్షణ కల్పిస్తాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 10న ప్రపంచ టీకా దినోత్సవం సందర్భంగా అన్ని కుటుంబాల్లోనూ వివిధ వయసుల వారు తీసుకోవాల్సిన టీకాలు, వాటి ప్రాధాన్యం గురించి కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డా. శ్రీకృష్ణ రాఘవేంద్ర బొడ్డు తెలిపారు.
“ఆధునిక వైద్యం సాధించిన అతిగొప్ప విజయాల్లో టీకాలు ప్రజారోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. మన దేశంలో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం (యూఐపీ) కింద ప్రతి సంవత్సరం సుమారు 2.67 కోట్ల మంది శిశువులు, 2.9 కోట్ల మంది గర్భిణ/లు టీకాలు పొందుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ), యూనిసెఫ్ అంచనాల ప్రకారం.. భారతదేశంలో డీటీపీ3 (డిఫ్తీరియా-టెటనస్-పెర్ట్యుసిస్) టీకా దాదాపు 94% మందికి అందుతోంది.
అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ దాదాపు సాధించినట్లే. తెలంగాణలో పిల్లలకు టీకాలు సుమారు 67% అందుతున్నాయి. అంటే కొంతవరకు విజయం సాధించినా ఇంకా మరింతమందికి అందాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మారుమూల గ్రామాలు, వలసల కుటుంబాల్లో అవగాహన కల్పించాలని తెలుస్తోంది. ఇటీవలి అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం.. టీకాలు ఎంతగా ప్రభావం చూపిస్తాయో తెలుస్తోంది.
ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ (2025) ప్రచురించిన అధ్యయనం ప్రకారం 1974 నుంచి ఇప్పటి వరకు 154 మిలియన్ల మంది ప్రాణాలను టీకాలే కాపాడాయి. అంటే ప్రతి నిమిషానికి 6 ప్రాణాలను కాపాడినట్లు లెక్క. వీటిలో మీజిల్స్ టీకా ఒక్కటే 60% ప్రాణాలను కాపాడింది. దీన్ని బట్టి అంతర్జాతీయంగా పిల్లల మరణాలను తగ్గించడంలో టీకాల పాత్ర ఏంటో తెలుస్తుంది. ఇంటర్నేషనల్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ సొసైటీ (ఐఎస్‌ఐడీ) అధ్యయనం ప్రకారం, 1980లలో ప్రారంభించిన ఎక్స్పాండెడ్ ప్రోగ్రాం ఆన్ ఇమ్యునైజేషన్ (ఈపీఐ) స్మాల్పాక్స్ నిర్మూలన, పోలియో నియంత్రణ కూడా సాధ్యమయ్యాయి.
రోటావైరస్ టీకాపై జరిగిన పరిశోధనల ప్రకారం, ఆసుపత్రుల్లో పిల్లల చేరికలు తగ్గడమే కాకుండా తల్లుల మానసిక ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనిపించింది. టీకాల ప్రభావం అనేది కేవలం వ్యాధుల నియంత్రణకు మాత్రమే పరిమితం కాలేదని తెలుస్తోంది. అయితే, 2023లో ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల చిన్నారులు తమ మొదటి మీజిల్స్ టీకాను పొందలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025లో తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా సమాన స్థాయిలో టీకాలు అందించాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ఉయ్యాల నుంచి వృద్ధాప్యం వరకు అనే దృష్టిలో టీకాలను చూడాలని డాక్టర్ శ్రీకృష్ణ స్పష్టం చేశారు. అంటే జీవితంలోని ప్రతి దశలోనూ కొన్ని ప్రత్యేక టీకాలు అవసరమే. పిల్లలకు పోలియో, మీజిల్స్, డిఫ్తీరియా, హెపటైటిస్ బి లాంటి వ్యాధుల నుంచి రక్షణకు టీకాలు కావాలి. యుక్తవయసు వారికి హెచ్పీవీ, టెటనస్ బూస్టర్లతో ప్రయోజనం ఉంటుంది. పెద్దవయసు వారికి ఫ్లూ టీకాలు, కొవిడ్-19 బూస్టర్లు, ప్రయాణ టీకాలు వేయాలి. వృద్ధులకు న్యూమోనియా, షింగిల్స్ టీకాలు ఇవ్వాలి.
వాటివల్ల తీవ్ర సమస్యలు తగ్గుతాయి. నిపుణులైన వైద్యులను సంప్రదించి సరైన సమాచారం పొందాలని తెలిపారు. కామినేని ఆస్పత్రిలో పిల్లలు, పెద్దలు, వృద్ధుల కోసం అన్ని ముఖ్యమైన, అధునిక టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరూ ఆస్పత్రిని సందర్శించి, తమ టీకాల రికార్డును సకాలంలో తనిఖీ చేసుకుంటూ, అవసరమైన టీకాలు తప్పక తీసుకోవాలి అని డాక్టర్ శ్రీకృష్ణ సూచించారు.
ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా టీకాలను యూఐపీ కింద అందిస్తారని ఆయన చెప్పారు. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో, పాఠశాలల్లో టీకా కార్యక్రమాలు అమలవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ సమాజ ఆరోగ్యానికి తోడ్పడుతోందని చెప్పారు.