09-11-2025 12:51:09 AM
10 ఏళ్లకోసారి టెటనస్, డిఫ్తీరియా, పర్టుసిస్ బూస్టర్ డోసులు తీసుకోవాలి
కిమ్స్ కడల్స్ డాక్టర్ బాబు ఎస్ మడార్కర్
రేపు ప్రపంచ టీకా దినోత్సవం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): టీకాలు భవిష్యత్తు రక్షణ కవచాలు అని డాక్టర్ బాబు ఎస్ మడార్కర్, క్లినికల్ డైరెక్టర్, చీఫ్ నీయోనటాలజిస్టు, కిమ్స్ కడల్స్, సికింద్రాబాద్ అన్నారు. నవంబర్ 10న ప్రపంచ టీకా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. “టీకాలు మానవ చరిత్రను మార్చిన అత్యంత శక్తివంతమైన ఆవిష్కరణల్లో ఒకటి.
స్మాల్ ఫాక్స్ నిర్మూలించడం నుండి దేశంలో పోలియోను నిర్మూలించడం వరకు, టీకాలు కోట్లాది ప్రాణాలను రక్షించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, టీకాలు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మరణాలను నివారిస్తాయి. భారతదేశం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం (యూపీఐ), 1985లో ప్రారంభించబడింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమాలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం 2.7 కోట్ల శిశువులకు, 3 కోట్ల గర్భిణీ స్త్రీలకు 12 ప్రాణాంతక వ్యాధుల నుండి ఉచిత టీకాలను అందిస్తుంది.
ఈ విజయానికి పునాది వేశారు లక్షలాది ఆరోగ్య కార్యకర్తలు. ఆశా, ఏఎన్‌ఎమ్, మరియు నర్సింగ్ సిబ్బంది దూరప్రాంత గ్రామాలు, కొండలు, మరియు అడవులను దాటి ప్రతి ఇంటికి రక్షణ తీసుకెళ్తున్నారు. అయితే, సవాళ్లు ఇంకా ఉన్నాయి. భౌగోళిక అడ్డంకులు, పేదరికం, అపోహలు, మరియు కోవిడ్ తరువాతి అంతరాయాలు కొన్ని ప్రాంతాల్లో టీకాల ఇవ్వడానిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కొల్ చైన్ వ్యవస్థలను బలోపేతం చేయడం, కోవిన్వంటి డిజిటల్ మానిటరింగ్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించడం, అత్యవసర, ఐచ్ఛిక టీకాలపై అవగాహన పెంచడం తదుపరి ముఖ్యమైన దశలు. మిషన్ ఇంద్రధనుష్ వంటి కార్యక్రమాలు కవరేజీని వేగవంతం చేశాయి. కానీ నిజమైన పురోగతి ప్రతి చిన్నారి, ప్రతి వయోజనకుడికి, వారి నేపథ్యం లేదా ప్రాంతం ఏదైనా సరే, టీకాలు అందినప్పుడే సాధ్యమవుతుంది.
టీకాలు ప్రభుత్వ పథకమని కాకుండా, సామూహిక బాధ్యతగా చూడాలి. చిన్నారుల టీకాలపై ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ, పెద్దల టీకాలు కూడా అంతే ముఖ్యమైనవి. పెద్దవారికి ఇన్‌ఫ్లూయెన్జా, నిమోనియా, హెపటైటిస్ బి, హెచ్పివి సంబంధిత క్యాన్సర్లు వంటి వ్యాధులపై రక్షణ అవసరం. టెటనస్, డిఫ్తీరియా, పర్టుసిస్ బూస్టర్ డోసులు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తీసుకోవాలి. టీకా పట్ల ఎక్కువగా తప్పుడు సమాచారంతో పెరుగుతోంది. దీనిని ఎదుర్కోవాలంటే నమ్మకం, పారదర్శకత, వైద్య నిపుణులు సమాజాల మధ్య బలమైన సంభాషణ అవసరం.
టీకాలు అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొని ఆమోదించబడతాయి. వాటి భద్రత, ప్రభావశీలతకు దశాబ్దాల శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ప్రతి విజయవంతమైన టీకా కార్యక్రమం వెనుక ఉన్నది మనుషుల కృషి. దూరప్రాంతాల వరకు నడిచి వెళ్లి కుటుంబాలను ధైర్యం చెప్పే ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు, వైద్యులు. వారి అంకితభావమే భారత ఆరోగ్య వ్యవస్థకు ప్రాణం.
ప్రపంచ టీకా దినోత్సవం 2025 సందర్భంగా మనం ఒక సమిష్టి ప్రతిజ్ఞ చేద్దాం. ఏ చిన్నారి, ఏ పెద్ద, ఏ సమాజం కూడా వెనుకబడకూడదు. ప్రతి టీకా ఒక ఆశా కవచమై ప్రాణాల ను కాపాడుతుంది, కుటుంబాలను బలపరుస్తుంది, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిస్తుంది” అని అన్నారు.