సెంటర్లకు నోట్ బుక్స్
పంపిణీకి సిద్ధంగా 1.11 కోట్ల నోట్ బుక్స్
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతి విద్యార్థులకు వర్క్ బుక్స్, ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్‌ను గతేడాది నుంచి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
1.11 కోట్ల నోట్ బుక్స్..
ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం పంపిణీ చేసేందుకు అధికారుల లెక్కల ప్రకారం 1,11,97,976 నోట్ బుక్స్‌ను సిద్ధం చేశారు. ఇవి హైదరాబాద్ కేంద్రం నుంచి 33 జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి మండల్ రిసోర్స్ కేంద్రాలకు చేరినాయి. రవాణాకు సంబంధించిన నిధులను సైతం అధికారులు విడుదల చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజు జూన్ 12 కల్లా టెక్స్ బుక్స్‌తో పాటు నోట్ బుక్స్‌ను కూడా పంపిణీ చేస్తారు.
విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలకు గురువారం వరకు మొత్తం 86.93 శాతం చేరినట్లు అధికారులు వెల్లడించారు. 2023 లెక్కల ప్రకారం 25,80,291 మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. అయితే వీరికి 1,24,40,725 జిల్లా కేంద్రాలకు చేరగా, ఇంకా 18,70,416 పాఠ్యపుస్తకాలు చేరాల్సి ఉంది.
ఒక్కో తరగతికి ఒక్కో రకంగా...
తరగతి స్థాయిని బట్టి
నోట్‌బుక్స్ పంపిణీ ఇలా..
* 6వ తరగతి విద్యార్థులకు 6 నోట్ బుక్స్
* 7వ తరగతి విద్యార్థులకు 6
* 8వ తరగతి విద్యార్థులకు 7
* 9వ తరగతి విద్యార్థులకు 7
* 10వ తరగతి విద్యార్థులకు 14
* 11వ తరగతి విద్యార్థులకు 12
* 12వ తరగతి విద్యార్థులకు 12






