calender_icon.png 18 January, 2026 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశాల్లో నర్సింగ్ విద్యార్థులకు డిమాండ్

18-01-2026 05:26:14 PM

హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు 362 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్‌టీయూ కళాశాలకు శంకుస్థాపన చేసినంతరం కూసుమంచిలో వంద పడకల ఆసుపత్రి, మద్దులపల్లిలో నూతన మార్కెట్ యార్డు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఏదులాపురం నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. వివిధ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్చుకునేలా ప్రభుత్వం అవసరమైన కార్యాచరణను రూపొందిస్తుందని తెలిపారు. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఇంజనీరింగ్ కంటే నర్సింగ్ విద్యార్థులకు అత్యధిక డిమాండ్ ఉందని, భాష ఒక్కటే అడ్డంకిగా మారిన నేపథ్యంలో ఇక్కడి విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలను బోధించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. 

త్వరలోనే నర్సింగ్ కాలేజీలకు ఆ భాషలను బోధించే ఉపాధ్యాయులను పంపిస్తామని, ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, సమాజంలో వైద్య వృత్తికి, వైద్యులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి వృత్తిలో ఉన్నవారు వ్యక్తిగతంగా కష్టనష్టాలు ఎదురైనప్పటికీ నిరుపేదలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహించరాదని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిరుపేదలకు సేవలందించడం ఒక బాధ్యతగా భావిస్తూ నర్సింగ్ వృత్తిలో రాణించి దేశ ప్రతిష్టను మరింత పెంచాలి. 

నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం“ అని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులతో కలిసి మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో రేషన్ కార్డు లేని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అయోధ్యలోని రామమందిరాన్ని తలపించే విధంగా భద్రాచలం రాముల వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.