18-01-2026 04:36:31 PM
ఇంటి స్థల వివాదం.. తమ్ముడి దారుణ హత్య...!
ఘటన స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య
తాండూరు,(విజయక్రాంతి): ఆస్తి అంతస్తుల కోసం బంధువులు, బంధుత్వాలు మరిచి మృగాలుగా మారుతున్నారు కొందరు మనుషులు . తోడబుట్టిన వారని పేగు పంచుకుని వాడని దయ, కనికరం లేకుండా సొంత తమ్ముడినె బామ్మర్ది తో కలిసి పట్టపగలే దారుణంగా కత్తి తో పొడిచి చంపాడు ఓ అన్న. స్థానికులు, డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం మాణిక్ నగర్ కు చెందిన మోసిన్ మరియు రెహమాన్ ఇద్దరు తోడబుట్టిన అన్న తమ్ముళ్లు. అయితే వీరి ఇంటి ముందర ఉన్న స్థలం విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రెహమాన్ గత కొంతకాలంగా హైదరాబాదులో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్తి విషయం సామరస్యంగా మాట్లాడుకుందామని నమ్మబలికి మోసిన్, తమ్ముడు రెహమాన్ను ఆదివారం హైదరాబాద్ నుండి తాండూరుకు పిలిపించాడు.
ఇరువురి మధ్య స్థలం విషయంపై చర్చ జరుగుతుండగా మళ్ళీ ఘర్షణ మొదలైంది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన మోసిన్, తన బామ్మర్ది సహాయంతో రెహమాన్ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో రెహమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టపగలే ఈ దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య సమాచారం అందిన వెంటనే తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. రెహమాన్ సోదరి షహర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య తెలిపారు.