13 April, 2026 | 9:02 PM

గర్భిణులు, పిల్లలకు పోషకాహారమే రక్ష

29-10-2025 12:00 AM

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బిచ్కుంద, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో  మంగళవారం పోషణ మాసం మహోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పాల్గొన్నారు..గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపించి సంప్రదాయ పద్ధతిలో చీరలు,గాజులు, పూలు, పండ్లు అందజేశారు. ఆ తర్వాత నూతనంగా జన్మించిన పిల్లలకు అన్న ప్రాసన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన, బలమైన సమాజ నిర్మాణం పౌష్టికాహారంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లి గర్భం నుంచే పునాది జరగాలన్నారు.. తల్లి మంచి పౌష్టికాహారం తీసుకోగలిగితే పుట్టబోయే పిల్లలు  కూడా బలంగా, దృఢంగా, ఆరోగ్యవంతంగా జన్మిస్తారన్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, ఆరోగ్య అవగాహన పెంపొందించడం చాలా అవసరమని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం  అంగన్వాడీలు చేస్తున్న కృషిని అభినందించారు. మారుతున్న మన ఆహారపు అలవాట్ల కారణంగా మన ఆరోగ్యం చెడిపోతుందని, వివిధ రోగాలకు గురవుతున్నామన్నారు.

మళ్ళీ మన పాత ఆహారపు పదార్థాలు జొన్నలు, సజ్జలు, రాగులు, మిల్లెట్స్ (చిరుధాన్యాలు) వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం, వారికి అందిస్తున్న పౌష్టిక ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో  39,120 కుటుంబాలు అంగన్వాడీ వ్యవస్థ ద్వారా లబ్ది పొందుతున్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు 40 టాయిలెట్స్ మంజూరు అయ్యాయని త్వరలోనే వాటి నిర్మాణాలు పూర్తి చేస్తామని, నూతన అంగన్వాడీ  భవనాల నిర్మాణాలను కూడా  చేపడుతామని అన్నారు.