29-10-2025 12:00:00 AM
నిజామాబాద్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): కవిత రేవంత్ బిజినెస్ పార్ట్నర్లు కాబట్టే కవిత రాజీనామా ఆమోదం చేయకుండా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.కవిత రాజీనామా ఆమోదం ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే కల్వకుంట్ల కుటుంబం సహించదని ఆయన అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనూ బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఆరు మున్సిపాలిటీలకు రూ.169.3 కోట్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు.
ఆ నిధులు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవెనని అరవింద్ గుర్తు చేశారు. 80% రాష్ట్రం కేవలం 20% నిధులు మాత్రమే ఇచ్చిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తామే నిధులు తెచ్చామంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్వోబీ నిధుల కేటాయింపుపై తాను ప్రకటించిన విధంగా దీక్షకు సిద్ధమవుతున్నామని అందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మాధవ నగర్ ఆర్‌ఓబి వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ లో బీజేపీ పట్టు బలంగా ఉందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతుగా కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు