11-05-2025 08:31:38 PM
ధాన్యం తరలింపులో అధికారుల తలమునకలు
మహబూబాబాద్,(విజయక్రాంతి): వాతావరణంలో మార్పుల కారణంగా ఎప్పుడు వర్షాలు కురుస్తాయో తెలియని పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల్లో ఒక్కటి కూడా కొనుగోలు కేంద్రాల్లో ఉండకుండా మిల్లులు, గోదాములకు తరలించే పనిలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సెలవు అయినప్పటికీ వివిధ శాఖల అధికారులు ధాన్యం బస్తాల తరలింపు కార్యక్రమంలో తలమునకులయ్యారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ కే. వీరబ్రహ్మచారి నిరంతరం ధాన్యం కొనుగోలు, రవాణా అంశంపై మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులను ధాన్యం కొనుగోలు, రవాణా లో ఇబ్బందులు కలగకుండా క్లస్టర్ వారిగా పర్యవేక్షించేందుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
అలాగే మండల స్థాయి అధికారులను సైతం దాన్యం, కొనుగోలు రవాణా అంశంలో బాధ్యులను చేయడంతో పాటు ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. యాసంగిలో రైతులు పండించిన 1,96,000 మెట్రిక్ టన్నుల దాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఏప్రిల్ నెలలో 45 వేలు, మే నెలలో 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటికే 55 కొనుగోలు చేయగా, మరో 20 రోజులు ధాన్యం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు ఎక్కడ కూడా ఉండకుండా మిల్లులకు గోదాములకు తరలించే విధంగా ఆదివారం సెలవు అయినప్పటికీ అధికారులు దగ్గరుండి అందుబాటులో ఉన్న లారీలు, డీసీఎం వ్యాన్లు, చివరకు ట్రాక్టర్ల ద్వారా మిల్లులు, గోదాములకు తరలించారు. జిల్లా, మండల స్థాయి అధికారులకు దాన్యం ఎగుమతి ప్రధాన అంశంగా మారింది.