12-05-2025 11:30:29 AM
లక్ష కోట్లు ఎక్కడికి పోయాయి
ముఖ్యమంత్రి మాటల వెనక ఆక్రోశం.. బాధ వేరే ఉంది: కవిత
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) ఆరోపించారు. ముఖ్యమంత్రి మాటల వెనుక ఆక్రోశం, బాధ వేరే ఉందని కవిత తెలిపారు. టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని చెప్పిన కవిత 1.75 లక్షల ఎకరాలను కుదువపెట్టాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో తెచ్చారని పేర్కొన్నారు. అన్ని భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదువపెట్టేలా జీవో తెచ్చారని వెల్లడించారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిస్తే ఎందుకు దాచారో సీఎం జవాబివ్వాలని కవిత డిమాండ్ చేశారు. స్టాక్ ఎక్చ్సెంజ్ లో పెట్టాక 1.75 లక్షల ఎకరాలకు ఎవరిది బాధ్యత? అని ప్రశ్నించారు.
నిపుణుల సిఫారస్సు లేకుండా చేస్తే జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. భూములు కుదువపెట్టి.. వచ్చిన డబ్బు పక్కదారి పట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె ఆరోపించారు. గచ్చిబౌలి భూముల నుంచి వచ్చిన రూ. 10 వేల కోట్లపై రకరకాల ఆరోపణలు వచ్చాయన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 1.80 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. రూ. 80 వేల కోట్లు మాత్రమే అప్పులు.. వడ్డీల కోసం చెల్లించారు. రూ. లక్ష కోట్లు ఎక్కడికి పోయాయి.. పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారని అని ప్రశ్నించారు. 20 శాతం కమీషన్ రేవంత్ రెడ్డి ఖజానాలోకి వెళ్లినట్లు ఆధారాలున్నాయని కవిత స్పష్టం చేశారు.
ప్రభుత్వ అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం(White paper on Telangana debts) ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని తేల్చిచెప్పారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలే చెబుతున్నాననని, పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. ఇలాంటి సందర్భంలో దుష్ప్రచారం సరికాదని హితువు పలికారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన కవిత.. సమయం వస్తే అన్నీ బయటకు వస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఆరు నెలలు జైల్లో ఉన్నది సరిపోదా?.. ఇంకా కష్టపెడతారా? అని ప్రశ్నించారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని కవిత హెచ్చరించారు. తనపై దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని భావిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) తెలిపారు.