12-05-2025 10:42:40 AM
బుద్ధవనానికి అందాల భామలు
నాగార్జున సాగర్ అందాలు చూడతరమా
విజయవిహార్ లో మిస్ వరల్డ్ బ్యూటీస్
పాస్ లు ఉన్న వారికి మాత్రమే అనుమతి
- విజయ్ విహార్ ను అన్ని హంగులతో తీర్చిదిద్దారు
విజయక్రాంతి, నాగార్జునసాగర్: మిస్వరల్డ్– 2025 పోటీల కోసం హైదరాబాద్ కు వచ్చిన అందాల భామలు(Miss World contestants) నేడు నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ కు వెళ్లనున్నారు. కంటెస్టెంట్స్ ను బృందాలుగా చేసి రాష్ట్రంలోని ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాలకు ప్రభుత్వం తీసుకెళ్తున్నది. ఇందులో భాగంగా మొదటిరోజు అందాల భామలు బుద్ధవనాన్ని సందర్శించనున్నారు.బౌద్ధ ఆధ్యాత్మిక పర్యటనకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచ సుందరి 2025 పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన కొంతమంది పోటీ దారులు నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. వీరి రాక సందర్భంగా నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్దవనంలో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది.
సుమారు 30 దేశాలకు చెందిన ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు సోమవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న బుధవానాన్ని సందర్శిస్తారు. వివిధ దేశాల సుందరీమణులు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకు చెందిన అందగత్తెలు మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొంటుండగా.. ఆసియా దేశాల నుంచి వచ్చినవారు మాత్రం బుద్ధవనం సందర్శనకు వెళ్లనున్నారు. బౌద్ధమతంపై విశ్వాసం, బుద్ధుని చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి గల 30 దేశాలకు చెందిన మిస్‌వరల్డ్ పోటీదారులు బౌద్ధ థీమ్‌పార్క్‌లోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల చెంత జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యేకించి ఆయా దేశాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి భారీ బందోబస్తు మధ్య పర్యాటక అభివృద్ధిసంస్థ ప్రత్యేక బస్సులో వీరిటి నాగార్జునసాగర్‌కు తీసుకువెళ్లనున్నారు
ముందుగా వీరంతా హైదరాబాద్ నుండి బయలుదేరి నల్గొండ జిల్లా, చింతపల్లి సమీపంలో ఉన్న అతిథి గృహం వద్ద కాసేపు ఆగుతారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి విజయ్ విహార్ చేరుకుంటారు. అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనం చేరుకుంటారు. ఈ సందర్భంగా సుమారు 24 మంది లంబాడా కళాకారులు వారికి లంబాడా నృత్యంతో స్వాగతం పలుకుతారు. మహా స్థూపం వద్ద స్వాగతం అనంతరం స్థూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మహా స్థూపంలోకి ప్రవేశించిన తర్వాత మహా స్థూపానికి సంబంధించిన వివరాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వివరిస్తారు. అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం తర్వాత ఇక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహా బోధి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం జాతక వనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం ప్రాముఖ్యతను పురావస్తు, టూరిజమ్ ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతక వనం సందర్శన అనంతరం బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
పాస్ లు ఉన్న వారికి మాత్రమే.
మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 121 మంది నుంచి అందాల మణులు హాజరవుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలను చూసేందుకు ఆసక్తికరంగా ప్రజలు వస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్ లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. అందాల భామలు తెలంగాణలో కనువిందు చేయనున్నారు.
అన్ని హంగులతో తీర్చిదిద్దారు
ఇందుకోసం బుద్ధ వనం విజయ్ విహార్ ను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు: ఎస్పీ శరత్ పవార్ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా కంటెస్టెంట్స్ వస్తుండటంతో నాగార్జున సాగర్ లో 2 వేల మంది సిబ్బందితో పోలీస్ శాఖ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ పవార్ తెలిపారు.నాగార్జున సాగర్ లో బందోబస్తుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా బాంబు, డాగ్ స్క్వాడ్, ఏరియా డామినేషన్ బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. బుద్ధవనం పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, బెలూన్లు ఎగరేయడం, క్రాకర్స్కాల్చడాన్ని నిషేధించారు..
బుద్ధవనం.. చారిత్రక ప్రాంతం
నాగార్జున సాగర్.. చారిత్రక ప్రాంతంలో వెలసిన ఆధునిక దేవాలయం. రైతన్న నీటి అవసరాలతో పాటు విద్యుత్తు అవసరాలను తీర్చే ఈ బహుళార్థసాధక ప్రాజెక్టు ప్రపంచంలోనే ఓ అద్భుతం. ఇక్కడి నాగార్జున కొండ పై ఆచార్య నాగార్జునుడు తత్వాలను బోధించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఆనకట్ట ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం శ్రీపర్వతం, విజయపురి, నాగార్జున కొండగా ప్రసిద్ధిగాంచింది. తొలుత ఈ ప్రాంతంలో శాతవాహనులు ఉండేవారు. మూడో శతాబ్దంలో ఇక్ష్వాకులకు నిలయంగా మారింది.సాగర్ హిల్‌కాలనీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యాటక సంస్థ సంయుక్తంగా సుమారు 270 ఎకరాలలో బుద్ధవనం నిర్మిస్తున్నారు. ఇందులో 8 రకాల వివిధ పార్కులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 5 థీమ్ పార్కుల పనులు పూర్తి చేశారు. ఇక్కడ ప్రపంచంలోని వివిధ దేశాలలోని బౌద్ధమత స్తూపాలు, బుద్ధుని జననం నుంచి మరణం వరకు తెలియచేసే చిత్రాలున్నాయి.