అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు
బిజేపి నాయకుడు శ్రీనివాస్ ఆరోపణ
రామగిరి,(విజయక్రాంతి): ఆర్జీ-3లోని లోని సింగరేణి కార్మికులను అధికారులు వేదిస్తున్నారని మాజీ ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని, సింగరేణి కార్మికుల క్వాటర్స్ లో వారి పిల్లలు కూతురు కొడుకు అల్లుడు ఉంటే మీరు ప్రైవేటు వారని చెప్పి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కరెంటు కట్ చేయడం, నీళ్లు కట్ చేయడం, కార్మికులకు పీనల్ రెంట్ వేయడం ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.
సింగరేణి కంపెనీలో 11 డివిజన్ లో ఎక్కడ లేని ఈ పద్ధతి ఇక్కడ చేయడం విడ్డూరమని, అధికారులు సింగరేణి కంపెనీలో పని చేస్తున్నామని మరిచిపోయి మాకే అధికారం ఉన్నదని, మేము ఇష్టరాజ్యాంగ వ్యవహరిస్తామని అంటున్నారని, అధికారులకు అడుగులకు మడుగులోత్తుతున్న యూనియన్ నాయకులు గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం కార్మిక కుటుంబాలను ఇబ్బంది పెడితే కూడా మాట్లాడకపోవడం బాధాకరమని, ఆర్జీ-3 లో అనేకమైన సమస్యలు ఉన్న తాగునీటి శుభ్రత కార్మికుల సంక్షేమం మరిచి కేవలం కార్మికులను ఇబ్బందులకు గురి చేసే విధంగా అధికారులు వ్యవహరించడం సరైనది కాదన్నారు.
వందల క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయని, శిథిల వ్యవస్థ లో ఉన్న వాటిని పట్టించుకోకుండా కార్మిక కుటుంబాలు ఉంటే ఇబ్బందులకు గురి చేస్తారని, ఎండాకాలమని కూడా చూడకుండా పిల్లలకు స్కూలు ఉన్నాయని చూడకుండా కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఆర్జీ-3 లో ఉన్న జిఎం, పర్సనల్, ఎస్టేట్ అధికారుల తీరు మారకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున జిఎం ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.




