10-02-2026 01:38:09 AM
స్వాగతం పలికిన ఆలయ ఈవో, చైర్మన్
అమీన్పూర్, ఫిబ్రవరి 9 :శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఉన్నతాధికారుల బృందం సోమవారం నాడు క్షుణ్ణంగా పరిశీలించింది.ఆలయానికి విచ్చేసిన ట్రాఫిక్ ఎస్పీ, డీఎస్పీ, అమీన్పూర్ ఎంఆర్వో వెంకటేష్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మరియు సీఐ కి ఆలయ ఈవో శశిధర్, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మరియు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం, అధికారులు అందరూ కలిసి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయక కమిషనర్ చంద్రశేఖర్ జాతర పనుల పురోగతిని సమీక్షించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఎస్పీ మరియు డీఎస్పీ పార్కింగ్ స్థలాలను, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను పరిశీలించారు.
ఎంఆర్వో వెంకటేష్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, పారిశుధ్య పనులు, మంచినీటి సదుపాయం మరియు క్యూ లైన్ల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆలయ ఈవో, చైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు అధికారులకు, ఆలయ సిబ్బందికి సహకరించాలని వారు కోరారు.