డైరెక్టర్లకు ఓజీ.. శంకరే!
గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ దర్శకుడు రాజమౌళి
టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కు తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం గురువారం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. “శంకర్ గారు తమిళ దర్శకుడు కాదు.. మన తెలుగు డైరెక్టరే. ఆయనంటే తెలుగు వాళ్లకు అంత గౌరవం. ప్రస్తుత కుర్ర దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కానీ మేము శంకర్ గారిని చూసి గర్వపడుతుంటాం.
ఆయనే డైరెక్టర్లకు ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. మనకున్న పెద్ద కలల్ని సినిమా గా తీస్తే.. డబ్బులు వెనక్కి వస్తాయని అందరికీ నమ్మకం కల్పించింది డైరెక్టర్ శంకర్” అన్నారు. హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘రాజమౌళి గారు, శంకర్ గారు కాంప్ర మైజ్ అవ్వరు.. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు షూట్ చేస్తుంటారు’ అని తెలిపారు.
డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. “గేమ్ చేంజర్’ ఓ పొలిటికల్ లీడర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. అందరూ ‘శంకరాత్రి’ అని అంటున్నారు. కానీ ఇది ‘రామ్’ నవమి. ఎందుకంటే రామ్‌చరణ్ తన పాత్రల్లో ఒదిగిపోయారు” అని చెప్పారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “తమిళ్ సినిమాను శంకర్ గారు పాన్ ఇండియాగా చేశారు.
రాజమౌళి గారు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ఇద్దరి వల్లే ఇప్పుడు ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. ‘గేమ్ చేంజర్’ గొప్ప సినిమా కానుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, హీరోయిన్ అంజలి, నటులు శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సముద్రఖని తదితర చిత్రబృందం పాల్గొన్నారు.
రన్‌టైమ్ 2.45 గంటలు
‘గేమ్ చేంజర్’. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా పొలిటికల్ థిల్లర్‌గా రానుంది. అయితే ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 2.45 గంటల రన్‌టైమ్‌తో యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.






