calender_icon.png 14 December, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యయ్యో.. నాదేమి రాత ఓ భగవంతా..

14-12-2025 12:04:01 AM

  1. కళ్లు లేని భక్తుడి కన్నీటి ఆర్తి

కొండగట్టు స్వామిని ప్రశ్నిస్తున్న గంగాధర్ గానం 

అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంతా.. ఈ హృదయ విదారకమైన స్వరం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ మెట్లపై ప్రతిరోజూ మార్మోగుతోంది. ఇది ఏ పాటకారుడి గానం కాదు.. పెద్దపల్లికి చెందిన గంగాధర్ అనే అంధ భక్తుడిది. తన జీవిత వేదనను స్వరాలుగా మలిచి దేవుడితో జరిపే ఆర్త సంభాషణ ఇది.  ఐదేళ్లుగా జగిత్యాల జిల్లా కొండగట్టు స్వామి సన్నిధిలోనే నివాసముంటున్న గంగాధర్, కళ్లు లేని జీవితంలో కన్నీళ్లే తనకు తోడుగా మారాయని చెబుతున్నాడు. ప్రస్తుతం తన గానం మొత్తం వ్యక్తిగత జీవిత దుస్థితిని ప్రతిబింబిస్తోంది.

జన్మే శాపమై.. కళ్లు లేని బతుకు చూడు, కన్నీళ్లే తోడు.. పాపపు దేవుడా ఈ జన్మ నాకెందుకయ్యా.. అని గంగాధర్ పాడే ప్రతి పదం, అతని జీవితాన్ని ప్రశ్నగా నిలుపుతోంది. చూడలేని మాతృమూర్తి.. కడుపారా నన్ను గన్న తల్లి రూపాన్ని చూడలేకపోయానన్న బాధ అతని గానంలో స్పష్టంగా వినిపిస్తుంది. నన్ను గన్న తల్లిని చూడ భాగ్యం లేదాయే అని వేదనతో చెప్పుకొంటున్నాడు. 

తండ్రి లేని లోటు ..చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన గంగాధర్, కన్నతండ్రి లేని బతుకే వ్యర్థము బాపూ అంటూ తన జీవితంలోని శూన్యతను స్వరాల్లో వ్యక్తం చేస్తున్నాడు. తల్లి రూపం తెలియని బాధ, తండ్రి లేని లోటు కలసి అతని జీవితం చీకట్లో నడిచే ప్రయాణంగా మారిందని స్థానికులు అంటున్నారు.  భక్తుల కోరిక లు తీరుస్తున్న స్వామీ నన్నెందుకు చూడవు? గంగాధర్ వేదన కేవలం వ్యక్తిగత దుఃఖం మాత్రమే కాదు. అది దైవాన్ని నేరుగా ప్రశ్నించే ఆర్తి. ఆలయానికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరుతున్నప్పుడు, నిత్యం స్వామి సన్నిధిలోనే ఉన్న తనపై ఎందుకు కనికరం చూపడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నాడు.

మంది వచ్చి కోరికలు కోరుతుంటే మౌనంగా తీరుస్తున్నావు స్వామీ.. నీ కాడే నిత్యం ఉన్న నన్ను మాత్రం ఎందుకు చూడవు? అని గంగాధర్ గానం వినేవారిని కలచివేస్తోంది. అంగవైకల్యం అడుగడుగునా అడ్డుపడుతున్నా, భక్తిని మాత్రం విడిచిపెట్టకుండా స్వామి పాదాలనే ఆశ్రయంగా చేసు కున్నాడని స్థానిక భక్తులు చెబుతున్నారు. మానవత్వపు వెలుగు కోసం ఎదురుచూపు శరీర పరిమితులు ఉన్నప్పటికీ, గంగాధర్ స్వరం అపారమైన భక్తి, ఆత్మవేదనను ప్రతిబింబిస్తోంది. నా అంగవైకల్యమే నా పరీక్ష అయితే అంటూ స్వామి తన వేదన వినాలని వేడుకుంటున్నాడు.

ఉపాధి లేక, జీవన పోరాటం సాగిస్తున్న ఈ అంధ భక్తుడి గానం  దేవుడిని వేడుకోవడమే కాదు, సమాజం చూపించాల్సిన మానవత్వం, సహానుభూతి అవసరాన్ని కూడా గుర్తు చేస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ గానాన్ని విని భావో ద్వేగానికి లోనవుతున్నారు. కోరికలు తీర్చే కొండగట్టు స్వామి, నిత్యం తన కళ్ల ముందే ఉన్న ఈ కన్నీటి గానాన్ని ఆలకించి, గంగాధర్ జీవితంలో త్వరలోనే వెలుగు నింపుతాడని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 గడగోజు రవీంద్రాచారి