calender_icon.png 14 December, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమో: నారసింహ

14-12-2025 12:08:33 AM

  1. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి
  2. ప్రతి ఏటా ఐదు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు

స్వామివారికి తమ కోరికలు నివేదించి కలశం పెట్టి మొక్కితే 41 రోజుల్లో ఆ కోరికలను నెరవేర్చే దేవుడిగా ఇనుగుర్తి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఈ ప్రాంత  భక్తులకు ఇల వేల్పుగా మారాడు. అప్పటి కాకతీయుల సామ్రాజ్య నిల యం ఓరుగల్లు ఇప్పటి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో స్వయం వ్యక్తంగా వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మహి మాన్వితమైన కోవెలగా గుర్తింపు పొందింది. 11వ శతాబ్దంలో గణపతిదేవ చక్రవర్తి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

స్థల పురాణం

గ్రామ పొలిమేరలోని పడమటి కొండపై స్వామివారు ఒక పెద్ద బండపై వెలిశాడని చెబుతుంటారు. పూర్వం మచ్చర్ల వంశానికి చెందిన పట్టాభి శర్మ అనే బ్రాహ్మణుడి కలలోకి వచ్చి మీ ఊరికి పడమటి కొండపై వెలిశానని, నేను వెలిసిన చోట పెద్ద పుట్ట ఉంటుందని బండమీద నేను వెలిసిన ఆకారం ఉంటుందని, పూజ చేసినట్లుగా పూజా ద్రవ్యాలు మంచి పరిమళమైన వాసన వస్తుందని చెప్పగా గ్రామస్తుల సహకారంతో ఆ బ్రాహ్మణుడు వెళ్లి చూడగా అక్కడ అలాగే దర్శనమిచ్చాడని పురాణ గాథ.

ఈ విషయాన్ని తెలుసుకున్న కాకతీయ సామ్రాజ్యాధిపతి గణపతి చక్రవర్తి తొలుత లక్ష్మీ నరసింహ స్వామికి గుట్టపై, ఆ తర్వాత గ్రామంలో పెద్ద ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తోంది. వైఖానస ఆగమం ప్రకారం అప్పటినుంచి ఇప్పటి వరకు దేవాలయంలో నిత్య పూజలు నిర్వహిస్తుండడం విశేషంగా మారింది. మనసులో కోరిక అనుకొని స్వామివారికి కలశం పెట్టి మొక్కితే 41 రోజుల్లో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం.  

ఉత్సవాలు, వేడుకలు

ప్రతి ఏటా సంక్రాంతి రోజున స్వామివారికి గోదా కల్యాణం నిర్వహిస్తారు. మార్చి నెలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు కనుల పండువగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ పౌర్ణమి రోజున సామూహిక కుంకుమ పూజ నిర్వహిస్తారు.

ఉగాది రోజు పంచాంగ శ్రవణం అత్యంత వైభవంగా నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రతి పండగకు గ్రామంలోకి పల్లకిలో స్వామివారు ఊరేగింపుగా వెళ్లడం ఇక్కడ ప్రత్యేకత. కొండపైన దేవాలయంలో నేటికీ శ్వేత నాగు దర్శనం ఇవ్వడం గొప్ప విశేషంగా గ్రామస్తులు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం దీప దూప నైవేద్యాల కార్యక్రమంలో ఈ ఆలయాన్ని చేర్చడంతో స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు తిరునహరి కృష్ణమాచార్యులు తెలిపారు.

గ్రామానికి చెందిన ధర్మకర్తలు ఒద్దిరాజు సోదరులు, దాతలు వద్దిరాజు సోదరుల సహకారంతో ఆలయంలో ప్రతి వేడుక అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాలిగోపురం నిర్మాణం, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఈ ఆలయ దర్శనం కోసం రైలు ద్వారా కేసముద్రం చేరుకొని, అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా ఇనుగుర్తికి చేరుకోవచ్చు. అలాగే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా నేరుగా ఇనుగుర్తికి చేరుకోవచ్చు.

 బండి సంపత్‌కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి