అయ్యో ‘తండ్రి’ ఎంత పని చేశావు!
- పిల్లల్ని చంపి తనువు చాలించిన తండ్రి
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో హృదయ విధారక ఘటన
మహబూబాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఇద్దరు పిల్లలకు ఉరేసి, తాను మృతి చెందాడో తండ్రి. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూ ర్ మండలం అమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది. అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావళి (30) మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కాంత అనే మహిళను 9ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి విన్న, విలాస్, వికేష్ అనే ముగ్గురు పిల్లలు జన్మించారు.
కాగా ఇటీవల గుంశావళి తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. 15 రోజుల క్రితం భార్యతో గొడవ పడగా భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి నాయనమ్మ సీతమ్మ ఇంటికి వెళ్లిపోయింది. సోమవారం సాయంత్రం కూలి పనికి వెళ్లి వచ్చిన కాంత ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు కనిపించకపోవడంతో కుమార్తెను తమ్ముళ్లేరీ అని ప్రశ్నించగా నాన్న వచ్చి తీసుకువెళ్లాడని చెప్పింది. రాత్రి వరకు వారి ఆచూకీ కోసం గాలించినప్పటికీ కనబడలేదు.
అయితే మంగళవారం ఉదయం తొర్రూరు మార్కెట్ పక్కన చెట్టుకు ఇద్దరు పిల్లలు తండ్రి ఉరేసుకున్న విషయం తెలుసుకొని ముగ్గురిని విగతజీవులుగా చూసి కన్నీరు మున్నీరైంది. తండ్రి విలాష్ (5), వికేష్ (3)లను చాక్లెట్లు కొనిస్తానని బయటికి తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కనిపించకుండా పోయిన ముగ్గురి కోసం బంధువులు వెతుకుతుండగా, చెట్టుకు ఉరేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు.
సంఘటన స్థలికి తొర్రూరు సీఐ గణేష్, ఎస్‌ఐ ఉపేందర్ చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల్ని చంపాలనే ఉద్దేశ్యంతోనే తండ్రి వెంట తీసుకువెళ్లినట్లు భార్య కాంత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.






