ఆయిల్ పామ్ సాగుతో భరోసా
- రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆర్థిక శక్తి
- ఆయిల్ ఫెడ్ స్టేట్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
మహబూబాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఆయిల్ పామ్ పంట సాగు, రైతులకు 30 ఏళ్ల భరోసాగా నిలుస్తుందని, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో ఆయిల్ పామ్ పంట రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట సాగులో ఖమ్మం రైతుల స్ఫూర్తి ప్రశంసనీయన్నారు.
ఖమ్మం జిల్లా రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులతో పోలిస్తే 30 ఏళ్లు ముందున్నారన్నారు. అక్కడ ఆయిల్ పామ్ సాగు వల్ల కూలీలు కూడా బాగున్నారని, మన భూములకు కౌలు 10 నుంచి 20 వేలు ఉంటే,అక్కడ లక్ష రూపాయల కౌలు పలుకుతోందని, మనం కూడా ఆ స్థాయికి ఎదగా లన్నారు. ఒక్క కొడుకును కని 25 ఏళ్లు పెంచితే వాడు నిన్ను సాకుతాడో లేదో తెలీదు కానీ.. ఒక్కసారి ఆయిల్ పామ్ పంట సాగు చేస్తే, అది 4 ఏళ్ల తర్వాత నుంచి 30 ఏళ్ల పాటు మిమ్మల్ని సాకుతుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కృషి వల్లే తెలంగాణలో ఆయిల్ పామ్ విప్లవంలా విస్తరిస్తుందని చెప్పారు. ఇది కేవలం పంట కాదనీ, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆర్థిక శక్తిగా ఉంటుందని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, నర్సరీలు, కొనుగోలు హామీ మద్దతు రైతుకు బలంగా నిలుస్తోందన్నారు.






