29 April, 2026 | 3:47 AM

ప్రకృతితో మమేకమై మనుగడ

29-04-2026 02:11 AM
  1. శత్రువులను బురిడి కొట్టించేందుకు
  2. కెమెరాలో బంధించిన తాళ్లపేట ఎఫ్‌ఆర్‌ఓ

మంచిర్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): వన్యప్రాణులు ప్రకృతి శత్రువుల నుంచి రక్షించుకునేందుకు, శత్రువులను బురిడి కొట్టించేందుకు తమదైన నైపుణ్యతను ప్రదర్శిస్తుంటాయి. తమను తాము రక్షించుకోవ డానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం మభ్యపెట్టే కళ.

వాటి మనుగడ సాగించేందుకు, శత్రువుల బారి నుంచి కాపాడు కోవడం కోసం రూపం (పరిసరాలకు తగ్గ రంగు, ఆకృతి), ప్రవర్తన (శత్రువుల అలికిడి వినగానే ఏమాత్రం కదలకుండా శిలలా ఉండిపోవడం), ఎంపిక (తన శరీర రంగుకు సరిగ్గా సరిపోయే విధానాన్ని అంటే మట్టి లేదా రాళ్లను ఎంచుకోవడం) లాంటివి పాటిస్తూ వాటి మనుగడుకు ఈ మూడు స్తంభాల కలయికలతో శత్రువుల బారి నుంచి ప్రాణాలను కాపాడుకుంటున్నాయి.

రాళ్ల మధ్య ఒదిగిన పక్షి పిల్లలు..

ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షులు నేలపై గూడు కట్టుకునే పక్షులు. పరిసరాలతో పూర్తి గా కలిసిపోయే ఈ అద్భుతమైన లక్షణాన్ని జీవశాస్త్రంలో ‘క్రిప్టిక్ కలరేషన్’ అంటారు. ఈ నైట్ జార్ పక్షులు అవే పాటించాయి. తాళ్లపేట రేంజ్ ఎఫ్ ఆర్ ఓ సుష్మ తన కెమెరాలో బంధించిన దృశ్యాలను క్షుణ్ణంగా గమనిస్తే.. ఈ పక్షి అదృశ్యమయ్యే నిర్మాణం కనిపిస్తుంది.

1. శరీర ఆకృతి (శత్రువుల కంట పడకుండా, తన నీడ నేలపై పడకుండా చదునుగా పడుకోవడం), 2. రంగుల కలయిక (ఈకలపై ఉన్న మచ్చలు సరిగ్గా పక్కన ఉన్న మట్టి ముద్ద, రాతి రంగును పోలి ఉంటా యి), 3. మూసిన కళ్లు (కళ్లు తెరిచి ఉంటే తడికి మెరుస్తాయి కాబట్టి, వాటిని సగం మూసుకుని పరిసరాలను గమనిస్తాయి). శత్రువుల నుంచి రక్షించుకునేందు కు మనుషులతో పాటు జీవరాశులన్నీ తమదైన శైలీలో మనుగడ సాగిస్తుంటాయి.

అలాంటిదే మీరు చూస్తున్న ఈ చిత్రాలు మంచిర్యా ల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని తాళ్లపేట రేంజ్‌లో కనిపించాయి. ఓ పక్షి మట్టి, రాళ్ల మధ్య ఒదిగి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాటించిన అద్భుతమైన విధానాన్ని పరిశీలించాల్సిందే.