ఆయిల్‌పామ్ పంటను ప్రోత్సహించాలి
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మే 12 (విజయక్రాంతి) : జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును మరింత విస్తరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో ఆయిల్ ఫామ్ సాగు ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తక్కువ వ్యయంతో అధిక లాభాలు అందించే పంటగా ఆయిల్ ఫామ్ రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. రైతులకు నాణ్యమైన మొక్కలు, ఎరువులు, సాంకేతిక సూచనలు అందించేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఇప్పటివరకు సాగులోకి వచ్చిన ఆయిల్ ఫామ్ విస్తీర్ణం, కొత్తగా నమోదు చేసుకున్న రైతుల వివరాలు, నీటి వనరుల లభ్యత, డ్రిప్ సౌకర్యాల ఏర్పాటు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అలాగే ఆయిల్ ఫామ్ పంటపై రైతుల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రత్యేక శిబిరాలు, క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించాలని అధికారులకు తెలిపారు. సాగు ప్రారంభించిన రైతులకు సకాలంలో సబ్సిడీలు, సాంకేతిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తే ఆర్థికంగా మరింత లాభపడతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యాన శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






