13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

80 కోట్లతో ఆయిల్ పామ్ రిఫైనరీ

23-03-2026 01:15 AM

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

సిద్దిపేట, మార్చి 22 (విజయక్రాంతి)/నంగునూరు: రాష్ట్రంలోనే మొదటిదైన ఆయిల్ పామ్ రిఫైనరీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.40 కోట్ల నుంచి రూ. 80 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో పండించిన ఆయిల్ పామ్ గెలల నుంచి కేవలం ముడి చమురు మాత్రమే తీసేవారు. దీనిని శుద్ధి చేయడానికి పొరుగు రాష్ట్రాలకు పంపాల్సి వచ్చేది.

ఈ సమస్యను తీర్చేందుకు నర్మెటలో ఈ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిఫైనరీ అందుబాటులోకి వస్తే, ముడి చమురును ఇక్కడే శుద్ధి చేసి నేరుగా వంట నూనెగా మార్చవచ్చు. ఇక్కడ తయారయ్యే నూనెను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ‘విజయ’ బ్రాండ్ పేరుతో నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తారు. దీనివల్ల రైతులకు రవాణా ఖర్చులు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లావ్యాప్తంగా సాగుతున్న పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో రూ.15 కోట్లతో నిర్మించిన 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిని, రూ.3.60 కోట్లతో ఏర్పాటు చేసిన నూతన సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను ప్రారంభించారు. నంగునూరు మండలం గట్లమల్యాలలో రూ. 1.43 కోట్లతో నిర్మించిన పీహెచ్‌సీ భవనాన్ని, సిద్దిపేట పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో రూ.1.43 కోట్లతో నిర్మించిన యూపీహెచ్‌సీ భవనాన్ని ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు.

మర్కుక్‌లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో రూ.16.62 కోట్లతో చేపట్టనున్న అదనపు భవనాలు, మౌలిక సదుపాయాల పనులను ప్రారంభించారు. ఎన్సాన్‌పల్లిలో రూ.78 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అత్యాధునిక జిల్లా జైలు భవనం, జగదేవ్‌పూర్‌లో రూ.9.65 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయం, సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.141.34 కోట్లతో యుఐడిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు.