23 March, 2026 | 4:29 AM

బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాల్సిందే

23-03-2026 01:15 AM
  1. బడ్జెట్‌లో వివక్షత చూపించి అవమానించారు 
  2. కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కారు 
  3. జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సరిదిద్దక పోతే అసెంబీని ముట్టడిస్తాం 
  4. బీసీ సంఘాలు, అఖిలపక్ష నేతల హెచ్చరిక

హైదరాబాద్, మార్చి 22(విజయక్రాంతి): అధికారంలోకి రాకముందు కామా రెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి గద్దెనెక్కిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై అన్ని రంగాల్లో వివక్షత చూపిస్తూ నయవంచనకు గురి చేస్తుందని బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రం గా మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్- బీసీల వాటా అంశంపై సమావేశం జరిగింది.

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీసీ విద్యార్థి సం ఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ అధ్యక్షత వహించారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు జీ ఆనంద్ గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణలు పాల్గొని మా ట్లాడారు. ముందుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత రెండు బడ్జెట్లలో అన్యా యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ సారి ప్రవేశపెట్టిన మూడవ బడ్జెట్‌లో కూడా అన్యా యం జరిగిందన్నారు.

బీసీల సంక్షేమానికి 20000 కోట్లు కేటాయించాలని, చట్టబద్ధమైన బీసీ సబ్ తీసుకురావాలని, బీసీ విద్యా ర్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించడం కోసం ౧౦వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని తాము డిమాండ్ చేస్తూనే వస్తున్నామన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీసీలకు బడ్జెట్లో భిక్షగా కాకుండా, ఒక హక్కుగా దక్కాలంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా బీసీలకు కూడా చట్టబద్ధమైన సబ్‌ప్లాన్ తీసుకురావడానికి తక్షణమే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.   

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ ఈ బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేవలం 12,500 కోట్లు కేటాయించి బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా బీసీలను నమ్మించి నట్టేట ముంచిందని ఆయన ఆరోపించారు. మాజీ ఎంపీ కాంగ్రెస్‌నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఎవరి వాటా వారి కి దక్కాలనే సూత్రం రాష్ట్రంలో అమలు కావడంలేదని, జనాభా లెక్కల ప్రకారం బీసీ లు 56%ఉంటే బడ్జెట్లో నిధులు అతి స్వల్పం గా కేటాయించినందుకు తాను సిగ్గుపడుతున్నానని అన్నారు.

అధికార పార్టీలో ఉండి కూడా బీసీలలో వస్తున్న వ్యతిరేకతను దృష్టి లో పెట్టుకొని బీసీల తరఫున గళం విప్పుతున్నానని, బీసీలకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కోరుతానని అన్నారు. బీసీ సంఘాలు చేస్తున్న పోరాటానికి బీసీ బిడ్డగా మద్దతు ఇవ్వడానికి ఈ సమావేశానికి వచ్చానని వీహెచ్ తెలిపారు.

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని, ఏ ప్రభుత్వా లు అధికారంలో ఉన్న బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే బీజేపీ ప్రత్యక్షంగా  పాల్గొంటుందని తెలిపారు. సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగ గౌడ్, బీసీ డెమొక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లేపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.