13 April, 2026 | 7:56 PM

పెండింగ్ బిల్లుల క్లియర్‌కు ఓకే!

08-12-2024 02:55 AM

శాఖలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం

ఉద్యోగులందరికీ న్యాయం చేస్తాం

విజయోత్సవాల తర్వాత మళ్లీ సమావేశం

ఉద్యోగ సంఘాల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. శాఖలవారీగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతీ డిపార్ట్‌మెంట్ ఉద్యోగ సంఘాల నేతలతో విడివిడిగా సమావేశమై సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం చెప్పినట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు.

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు శనివారం భట్టి విక్రమార్కను కలిసి పెండింగ్ సమస్యలపై చర్చించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, అందరికి న్యాయం చేసేలా ముందుకెళ్తామని చెప్పారు. ఆర్థిక సమస్యలున్నాగానీ, నియామకాలు ఆపబోమని తెలిపారు.

ప్రజాప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించే ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ప్రజా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేకు సంపూర్ణ సహకారం అందించి, విజయవంతంగా నిర్వహించి భాగస్వామ్యులైన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు.  

వెంటనే ఆర్ధికేతర సమస్యలను పరిష్కరించండి: టీజేఏసీ 

ఆర్థిక పరమైన అంశాలను వచ్చే ఏడాది మార్చిలో పరిష్కరిస్తామని గతంలో ప్రభుత్వం చెప్పిందని, అయితే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్థికేతర అంశాలను త్వరగా పరిష్కరించాలని జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్‌రావు డిప్యూటీ సీఎంను కోరినట్టు తెలిపారు. మొత్తం 54 డిమాండ్లతో ఉన్న వినతి పత్రాన్ని భట్టికి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ 54 డిమాండ్లలో 11 అంశాలు ఆర్థికపరమైనవని, మిగతా 43 అంశాలు ఆర్థికేతర అంశాలని వివరించారు.

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని కోరారు. కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. గురుకుల, మోడల్ టీచర్ల ఉద్యోగులందరికీ ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, అన్ని జిల్లాలకు డీఈవో, డీఐఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని కోరారు.

2022 నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేసి, ఈ వ్యవస్థను రద్దు చేస్తూ, ట్రెజరీ ద్వారా బిల్లులను చెల్లించాలని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, 317 జీవో సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్‌మెంట్ డే తేదీని ప్రకటించాలని, గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అనంతరం డిప్యూటీ సీఎంను ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు.

ఉద్యోగుల సమస్యలపై దీపావళి తర్వాత మరోసారి సమావేశమవుదామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, కృష్ణుడు, పర్వత రెడ్డి, పి.సత్యనారాయణ, కె.జంగయ్య, రాధాకృష్ణ, అబ్దుల్లా , సైదులు తదితరులు పాల్గొన్నారు.