సముద్రపు ఒడ్డున!
అలలు ఒడ్డును తాకినప్పుడలా
నీటిపోటు ఉప్పొంగుతుంది
ఎప్పటికీ తనదికాని ఒడ్డును మళ్లీ మళ్లీ
పలకరిస్తుంది
ప్రతి గర్జనలో ఒక మరచిపోయిన జ్ఞాపకాన్ని
గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
వెనక్కి తిరిగే ప్రతి అల
నిశ్శబ్దాన్ని మాత్రమే వెంట తీసుకెళ్తుంది.
సముద్రం నుంచి వీచే గాలి
ఉప్పటి తేమను మోసుకొస్తోంది.
తడి ఇసుకపై నెమ్మదిగా
అడుగుల చిత్రాలు గీయబడుతున్నాయి
ప్రతి అల వచ్చి వాటిని చెరిపివేయదు
మరో అడుగు కోసం
ఒడ్డును తెల్లకాగితంలా సిద్ధం చేస్తుంది
కొంతమంది అలల లయకు
అడుగులు వేస్తూ నర్తిస్తున్నారు.
చిన్నపిల్లలు మాత్రం అలలతో
ఆటలాడుతున్నారు.
అల వెనక్కి జారగానే దాని వెంట
పరుగెడుతున్నారు.
అల మళ్లీ ఎదురొస్తే నవ్వుతూ
వెనక్కి పారిపోతున్నారు.
ఎవరు ఎవరిని తరుముతున్నారో
చివరికి ఎవరికీ తెలియదు.
దూరంగా మత్స్యకారుల పడవలు
అలల భుజాలపై ఊగుతున్నాయి.
సముద్రం ఆలపించే జోలపాటకు
నిద్రపోయే పిల్లల్లా తేలుతున్నాయి.
ఇంకా చాలా దూరంలో
సముద్రమూ ఆకాశమూ
ఒకదానినొకటి తాకినట్టే
కళ్లకు మాత్రమే కనిపిస్తున్నాయి.
చాలాసేపు ఆ కలయికనే చూస్తూ
నిలిచిపోయాను.
అక్కడికే చేరాలని నడక మొదలుపెట్టాను
నేను దగ్గరవుతున్న కొద్దీ
అది మరింత దూరమైంది
అప్పుడు నాకొక సత్యం బోధపడింది
అది అలలతో పాటు వచ్చింది
చేరలేనివే మనల్ని
ఎక్కువ దూరం నడిపిస్తాయి
అందనివాటినే
మనం జీవితమంతా అన్వేషిస్తాం.
అవే అనంతకాలం మనలో జీవిస్తాయి !!
బొల్లిముంత వెంకటరమణారావు






