బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటూ కష్టమే
బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్
హైదరాబాద్, మే ౨(విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా కష్టమేనని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో గురువారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కే రఘువీర్‌రెడ్డితో కలిసి నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్, బీజేపీకి వేసే ఓటు చెత్తబుట్టలో వేసినట్టే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని స్పష్టంచేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రుణమాఫీ కచ్చితంగా చేస్తామని పునరుద్ఘాటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు.




