31 March, 2026 | 12:40 AM

బీజేపీతో కేసీఆర్‌కు విడదీయలేని బంధం

03-05-2024 01:58 AM

ఎన్నికల సమయంలోనే విమర్శిస్తునట్లు నటన

అధికారం పోయిందనే కాంగ్రెస్‌పై అక్కసు

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్, మే 2 (విజయక్రాంతి):  బీజేపీతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు విడదీయలేని అనుబంధం ఉందని, ఆయన కేవలం ఎన్నికల సమయంలోనే బీజేపీని విమర్శిస్తున్నట్లు నటిస్తారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం వెల్టూరులో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలిందని మండిపడ్డారు. ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇస్తామని చెప్పి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రామాలు ఆడారని మండిపడ్డారు. లేనిపోని ప్రాజెక్ట్‌లు నిర్మించి రూ.కోట్ల కమిషన్లు తీసుకున్నారని నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజాసమస్యల పరిష్కారంపై పట్టింపు లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తూ, కాంగ్రెస్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. నాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ జీఎస్టీ, నోట్ల రద్దుకు తెరవెనుక ప్రధాని మోదీకి మద్దతు ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను పక్కన పెట్టి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు నైతిక మద్దతు తెలిపాలని కోరారు.