13 August, 2026 | 5:12 AM

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి

13-08-2026 01:20 AM

మాజీ మేయర్ ఆరోపణలకు మేయర్ కొలగాని కౌంటర్

ముకరంపుర, ఆగస్టు 12(విజయ క్రాంతి)కరీంనగర్ నగరపాలక సంస్థలో మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదని, మున్సిపల్ నిబంధనలను ఉల్లం ఘిస్తున్నారని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలను కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. మేయర్ మాట్లాడుతూ, గత ఐదు నెలల కాలంలో మూ డు పర్యాయాలు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించామని,

అంతేకాకుండా నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించి బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదంతో అమలు చేస్తున్నామని తెలిపారు.జరిగిన సమావేశాలన్నీ నగరపాలక సంస్థ అధికారిక రికార్డుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం అని మేయర్ పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై చర్చించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని మేయర్ స్పష్టం చేశారు.

ప్రతి అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చడం వల్ల అభివృద్ధి జరగదు. మీరు కూడా ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్. మీ డివిజన్ సమస్యలను తీసుకురండి. నగర అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయండి. మంచి సూచన ఉంటే స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధికి కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. విమర్శలను స్వాగతిస్తాం. నిర్మాణాత్మక సూచనలను స్వీకరిస్తాం. ప్రజా సమస్యలను కౌన్సిల్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ జరిగిన దాన్ని జరగలేదని చెప్పడం, వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లో అపోహలు సృష్టించడం మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.