13 August, 2026 | 2:48 AM

భూ సేకరణ పత్రాలు మాయం అయితే ఎట్లా?

13-08-2026 01:19 AM

అభివృద్ధికి సహకరిస్తే ఆమడ దూరంలో పెడుతుండ్రు 

నాటి భూ సేకరణ పత్రాలు ఎక్కడ పోయినట్లు

సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే 

నిర్వాసితులను చూసి నిలువునా ముంచుతారా!

ఉదండాపూర్ ప్రాజెక్టు వల్లూర్ భూ నిర్వాసితుల ఆవేదన

జడ్చర్ల, ఆగస్టు 12 (విజయక్రాంతి): దశాబ్దాల తరబడి పదిమందికి సాగునీరు తాగునీరు దరి చేరాలంటే ఆ నీరు నిలువ చేసేందుకు ప్రాజెక్టులు తప్పనిసరి అనే విషయం అందరికీ వివిధమే. కాగా నియోజకవర్గ పరిధిలోని ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్మాణం లో భాగంగా వల్లూరు గ్రామ పరిధిలోని భూసేకరణకు సంబంధించి నాటి రైతుల నుంచి అధికారులు అనుమతి పత్రాలు సేకరించారు.

వారి భూములో నిర్మాణం చేపట్టిన వాటితో పాటు వివిధ షెడ్లు బోర్లకు సైతం ప్రభుత్వం నష్టపరిహారం అందించేందుకు అంచనాలను రూపొందించి వారికి సహాయం చేసేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. కాగా వారికి నేటి కూడా పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వల్లూరు గ్రామ రైతులు నష్టపరిహారానికి సంబంధించి అనుమతి పత్రాలను ఆర్టిఐ ద్వారా తాసిల్దార్ కార్యాలయంలో అడిగినప్పటికీ వారు మా దగ్గర అందుబాటులో లేవని చెప్పడమేనక ఉన్న అంతర్యమేమిటీ అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

తప్పు ఎవరు చేశారు? శిక్ష అనుభవించాల్సిందేవారు?

2017 సంవత్సరంలో ఉదండాపూర్ బ్యాలన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కొరకు జడ్చర్ల మండలం వల్లూర్ గ్రామంలోని రైతుల వ్యవసాయ భూములను ప్రభుత్వం కాన్సెంట్ అగ్రిమెంట్ ద్వారా సేకరించింది. భూసేకరణ సమయంలో రైతుల పొలాల్లోని బోర్లు, చెట్లు, పశువుల కొట్టాలు, ఇతర కట్టడాలకు సంబంధించిన పరిహారం కూడా చెల్లిస్తామని అప్పటి అధికారులు హామీ ఇచ్చారు. కాగా 8 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఆ పరిహారం చెల్లించలేదని రైతులు వాపోతున్నారు.

పత్రాల  జాడ ఎక్కడ?

 సమాచార హక్కు చట్టం ద్వారా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో తమ కాన్సెంట్ అగ్రిమెంట్ పత్రాలను కోరారు. కార్యాలయంలో అట్టి పత్రాలు లభ్యంలో లేవని అధికారులు ఎండార్స్మెంట్ ఇచ్చారు.దీంతో రైతులు తేది: 24-03-2026న రాష్ట్ర సమాచార కమీషన్ కు ఫిర్యాదు చేశారు. 27-07-2026న జరిగిన విచారణలో జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఫైల్ No. 30.A/2338/2026, గత నెల 25న పత్రాల కోసం వెతికామని, లభ్యం కాలేదని రిపోర్టు సమర్పించారు. పత్రాలను అప్పజెప్పకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు.

సమగ్ర విచారణ చేయాలంటున్న రైతులు 

ప్రభుత్వ రికార్డులను అక్రమంగా తీసుకెళ్లిన అధికారులపై వివిధ చట్టాల ప్రకారం శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, పత్రాలను వారి నుండి స్వాధీనపర్చుకొని, రికార్డులను భద్రపర్చాలని రైతులు కోరుతున్నారు. ‘2017లో భూములు తీసుకున్నారు. బోర్లు, చెట్లకు డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు పత్రాలే లేవంటున్నారు. మా జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని  వల్లూర్ గ్రామ భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిగితే తప్పు చేసింది ఎవరు ? ఆ శిక్ష ఎవరికి పడుతుందనే వివరాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని రైతులు పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. అసలు ఆ పత్రాలు కనిపించకుండా చేయవలసిన అవసరం ఏం వచ్చిందని విషయంపై లోతైన విచారణ చేస్తేనే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.