08-12-2025 08:21:05 AM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఎప్పు డెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు(Gram Panchayat elections) రానే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో నియోజకవర్గాల వారిగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సమాయాత్తం అయ్యారు. ఇప్పటికే మూడు విడతల్లో ఆయా గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేయడం విత్ డ్రా చేసుకోవడం గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తికావచ్చింది. మొదటి విడత 151 గ్రామపంచాయతీలు 1326 వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. 14 గ్రామ పంచాయతీలు, 142 వార్డు సభ్యుల ఏకగ్రీవం కాగా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు 967 మంది, 3229 మంది వార్డు సభ్యులు బరిలో నిలిచారు.
ఈనెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు నేటి నుంచి మరో రెండు రోజులు మాత్రమే అవకాశం మిగిలింది. దీంతో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన మొదలయింది. ఆయా గ్రామాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు కులాలవారీగా ఓటర్లను విభజించి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ప్యాకేజీలను ఖరారు చేసుకుంటున్నారు. అభ్యర్థి గెలుపు కోసం మహిళా ఓటర్లు అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశాలు వారికి అనుకూలంగా వాగ్దానాలు ఇస్తూ తమను గెలిపించాలని నిత్యం వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు వారి ఇంటి వద్ద వంటలు చేయించి గ్రామస్తులకు అంత విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొన్ని గ్రామాల్లోని సర్పంచ్, వార్డ్ స్థానాలకు పోటీలో నిల్చున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి ఇంటికి సుక్క ముక్క అందించి ఓటు తమకే వేయాలని మచ్చిగ చేసుకుంటున్నారు.
ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు వార్డు స్థానాల్లో ఏకగ్రీవం చేస్తూ గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించుకున్నారు. వీరికి మద్దతుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచార రథాలపై ఊరేగుతూ ఓటును అభ్యర్థిస్తున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు ప్రజా ప్రభుత్వాన్ని ప్రజాపిష్టమేరకే నడుస్తోందని నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రచారం చేస్తుండగా ప్రతిపక్ష పార్టీ నేతలు తాను మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం ముమ్మరం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలా తాము మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు.
ఆయా గ్రామ సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యులు రిజర్వేషన్ ఆధారంగా పోటీలో నిలుచున్నప్పటికీ ఆయా కుల సంఘాల పెద్దలతో ప్రత్యేక సమావేశాల్లో ఏర్పాటు చేసుకొని ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. ప్రతి ఓటు కీలకమేనని భావిస్తూ ఆయా గ్రామాల్లో ప్రత్యేక మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి యువతకు విందు పార్టీలను ఏర్పాటు చేసుకొని ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వలస వెళ్లిన వారికి ఫోన్ చేసి మరి వరుసలు కలుపుకొని ఓటు అభ్యర్థిస్తున్నారు. రాను పోను ఖర్చులు ఎంత తామే భరిస్తామని వచ్చి ఓటు నమోదు చేసుకోవాలని ఒక్కో ఓటు ధర నిర్ణయిస్తూ వారి బుట్టలో వేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
రెండో విడత ఎన్నికలు ఈనెల 14న జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా ఎన్నికల్లో 151 గ్రామపంచాయతీలకు గాను 1046 మంది నామినేషన్లు దాఖలు చేశారు వీరిలో విత్ డ్రా చేసుకున్న వారి మినహ 473 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో ఎనిమిది గ్రామపంచాయతీలో ఏకగ్రీవం కాగా 1412 వార్డు సభ్యులకు గాను 3810 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు విత్ డ్రా చేసుకున్న వారి మినహా 3229 మంది అభ్యర్థులు వార్డు సభ్యులు బరిలో నిలిచారు. ఇందులో 142 మంది వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.