09-01-2026 12:00:00 AM
ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు
నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్‌షాపుల నిర్వహణ
అధిక ధరలకు మద్యం అమ్మకాలు
మహారాష్ట్రకు అక్రమంగా తరలింపు
మహాదేవపూర్, జనవరి 8 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం మ ద్యం మాఫియాకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన రెండు వైన్స్ షాపుల అనుమతులను ఆయుధాలుగా మార్చుకున్న కొంతమంది సిండికెట్ గా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు వైన్‌షాపులకు అనుమతి ఇవ్వగా, ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తూ, అధిక ధరలతో దోపిడీ చేస్తున్నట్లు మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 21 సంవత్సరాల లోపు వారికి మద్యం విక్రయించడం నేరం. అయితే మహాదేవపూర్ మండలంలో ఈ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని, పాఠశాల విద్యార్థులకూ మద్యం విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మహారాష్ట్రకు అక్రమ తరలింపులు
మహారాష్ట్రలో మద్యం బంద్ ఉన్న నేపధ్యంలో ఈ అవకాశాన్ని లాభంగా మార్చుకున్న మద్యం వ్యాపారుల సిండికేట్ కాళేశ్వరం వైన్స్ షాపుల నుంచి అంతర్ రాష్ట్ర వంతెన మార్గంలో రాత్రి వేళల్లో భారీగా మద్యం తరలిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని సిరివంచ, పరిసర గ్రామాలు ఈ అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రాలుగా మారాయని ప్రచారం సాగుతోంది.
వైన్స్ షాపుల్లో ఖాళీ,
బెల్ట్ షాపులకు ఫుల్లు..
కాళేశ్వరం ఆలయ ప్రాంతంలోనే దాదాపు 60 వరకు బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి.వైన్స్ షాపులకు వచ్చిన బ్రాండెడ్ బీర్లు, కింగ్ ఫిషర్ లైట్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్లను ప్రజలకు అమ్మకుండా, మొత్తం సరుకును బెల్ట్ షాపులకే తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రేట్ల దోపిడీ..
కింగ్ ఫిషర్ లైట్ వైన్ షాపుల్లో 180 ఎమ్మార్పీ ఉండగా, మద్యం షాపులో అమ్మకుండా బెల్ట్ షాప్కు 200 విక్రయిస్తుండడంతో బెల్ట్ షాపు నిర్వాహకులు 230 నుంచి 250 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే బ్రాందీ, విస్కీలను కూడా మద్యం షాపుల్లో విక్రయించకుండా బెల్ట్ షాపుల్లో అందుబాటులో ఉంచుతున్నారని దీనితో అధిక ధరలకు మద్యం కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ పాత్రపై అనుమానాలు..
మద్యం సిండికేటు అక్రమాలు బహిరంగంగా జరుగుతున్నా జిల్లా ఎక్సైజ్ శాఖ, కాటారం అబ్కారీ అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూల్ల మత్తులోనే అధికారులు నిద్రపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల డిమాండ్..
అక్రమంగా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్న వైన్స్ షాపులను తక్షణమే సీజ్ చేయాలని, మద్యం ప్రియులకు కావలసిన మద్యం వైన్స్ లోనే అందుబాటులో ఉంచాలని,అధిక ధరలకు అమ్మే బెల్ట్ షాపులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మద్యం మాఫియా అగడాలను కట్టడి చేయాలని కోరుతున్నారు.
నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం..
కాళేశ్వరం వైన్స్ షాపులో కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులో లేకపోవడం గురించి ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రతి వైన్స్ షాపులో కింగ్ఫిషర్ బీర్లు అమ్మకపోతే, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా మాకు చెప్పండి, తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
కిష్టయ్య, ఎక్సైజ్ ఎస్‌ఐ