calender_icon.png 5 July, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికోలపై జులుం

05-07-2025 01:18:23 AM

  1. స్టుఫైండ్స్‌పై తీరుమార్చుకోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు 
  2. 2003 నాటి జీవో చూపి మోసం 
  3. హక్కుల కోసం పోరాడుతున్న వైద్య విద్యార్థులు
  4. చల్మెడలో 64 మంది మెడికోల సస్పెన్షన్ 
  5. ఘటనపై మండిపడుతున్న జూడాలు 

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులపై రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలే జీల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నా యి. విద్యార్థులను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై పోలీసుల అమర్యాదకరం గా ప్రవర్తించేలా మేనేజ్‌మెంట్ కుట్రలు చేస్తోందని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. ఇటీవల కరీంనగర్‌లో చోటు చేసుకున్న ఘటనను ఉదహరిస్తున్నారు.

భవిష్యత్ వైద్యులనే కనీస ఆలోచన లేకుండా లాఠీలెత్తడంపై వైద్య విద్యార్థులంతా మండిపడుతున్నారు. యాజమాన్యాలు పోలీసుల ద్వారా దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తే బెదిరిపోమని ఐక్యంగా పోరాటం సాగిస్తామని, తమ హక్కులు సాధించుకుం టామని జూడాల సంఘం హెచ్చరించింది. 

ఆందోళన చేస్తే సస్పెండ్ 

నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిర్దేశించిన ప్రకారంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో స్టుఫైండ్స్ చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వ కాలేజీల్లో నిబంధనలను పాటిస్తున్నారు. ప్రైవేటు కాలేజీల్లో మాత్రం వైద్య విద్యార్థులను మోసం చేస్తూ వారి నుంచే అడ్వాన్స్‌గా డబ్బులు వసూలు చేసి వాటినే ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో చెల్లిస్తూ ఇదే స్టుఫైండ్స్ అన్నట్లుగా చూపుతున్నారు.

ఎన్‌ఎంసీ తనిఖీ లకు వచ్చేప్పుడు మాత్రం ముందస్తుగా అకౌంట్లలో స్టుఫైండ్స్ వేసి తర్వాత వాటి ని నగదు రూపంలో తీసేసుకుంటున్నారు. ఈ మోసంపై తిరగబడిన వైద్య విద్యార్థులపై మెడికల్ కాలేజీలు దౌర్జన్యాలకు దిగుతున్నాయి.

జూలై 1న కరీంనగర్ చల్మెడ మెడికల్ కాలేజీలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మెడికోలపై పోలీసులతో దౌర్జన్యంగా లాఠీచార్జీకి ఉసిగొల్పిన యాజమాన్యం శుక్రవారం వారిలో 64 మంది హౌస్ సర్జన్లను సస్పెండ్ చేసింది. ఇది విద్యార్థుల హక్కులను అణచివేసేందుకు చేస్తున్న నిరంకుశ విధానమని జూడాల మండిపడ్డారు. 

బెదిరింపులు, మానసిక ఒత్తిడి

సస్పెన్షన్‌తో ఆగకుండా కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలో బాగా ఆలస్యం చేయడం, ఇంటర్న్‌షిప్ ఎక్స్‌టెన్షన్ పేరిట బెదిరింపులకు దిగడం వంటి చర్యలతో వైద్య విద్యార్థులను భయపెట్టేలా రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు వ్యవహరిస్తున్నాయని జూడాలు అంటున్నా రు. ఎక్కడ ఉన్నత విద్య అవకాశాలు పోతాయోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని ఖమ్మం మమత మెడికల్ కాలేజీకి చెందిన ఓ వైద్య విద్యార్థి విజయక్రాంతికి తెలిపారు. 

ప్రభుత్వ కాలేజీలకు ఓ రూలు.. ప్రైవేటుకో రూలా..?

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇటీవల వైద్య విద్యార్థుల స్టుఫైండ్స్‌ను 15శాతం మేర పెంచుతున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌లో రూ.67,032, సెకండ్ ఇయర్‌లో రూ. 70,757, ఫైనల్ ఇయర్‌లో రూ.74,782 చొప్పున స్టుఫైండ్ అందనుంది. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్‌లో రూ. 1,06,461, సెకండ్ ఇయర్‌లో రూ. 1,11,78 5, థర్డ్ ఇయర్‌లో రూ.1,17,103 చొప్పున ఇస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో స్టుఫైండ్స్ భారీగా పెంచుతుంటే... ప్రైవేటులో మాత్రం ఇంకా 2003 నాటి జీవోను పట్టుకుని వేలాడుతున్నారని మెడికోలు వాపోతున్నారు.

కాలం చెల్లిన జీవోలతో వేధింపులు

ఎన్‌ఎంసీ నిర్దేశించిన స్టుఫైండ్స్ చెల్లించాలని డిమాండ్ చేసిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్న ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఇందుకు సాకుగా కాలం చెల్లిన జీవోలను చూపుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తు న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో జారీ చేసిన జీవో నెం.489ను చూపి స్తూ ఇప్పటికీ ప్రైవేటు మెడికల్ కాలేజీలు మోసం చేస్తున్నాయని కేయూ జూడా అధ్యక్షుడు డా. నవదీప్ తెలిపా రు. ఆ జీవో ప్రకారం నెలకు రూ. 5వేల స్టుఫైండ్ ఇస్తున్నామని చూపేందుకు వైద్య విద్యార్థుల వద్ద రూ. 25,000 ముందే వసూలు చేసుకుని వాటిని తర్వాత నెల నెలా అకౌంట్లలో వేస్తున్నారని తెలిపారు. 

పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి 

డాక్టర్స్ డే రోజున తమ సమస్యల పరిష్కారం కోసం చల్మెడ మెడికల్ కాలేజీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్య విద్యార్థులపై లా ఠీలు ఎత్తిన పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్ చేసిం ది. పోలీసులు లాఠీలు ఎత్తడంతో పా టు శుక్రవారం నాడు 64 మంది హౌస్ సర్జన్లను యాజమాన్యం సస్పెం డ్ చేయడం దారుణమన్నారు.

 తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం