23 April, 2026 | 2:51 AM

శబరిమలలో మన పూజారి

09-12-2024 12:48 AM

ఏడాదిపాటు విధులు పూర్తిచేసుకున్న మురళీ నంబూద్రి స్వామి

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేరళ రాష్ట్రం శబరిమలలో కొలువైన అయ్య ప్ప దేవాలయంలోని అయ్యప్పస్వామిని, మాళివికపురత్తమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి మాలాధారణతో ప్రతి ఏడాది లక్షలాది మంది అయ్యప్పలు  తరలివెళ్తుంటారు. అంతటి విశిష్ట ప్రాధాన్యత కలిగిన శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఏడాది కాలం ప్రధాన అర్చకులుగా పనిచేసిన మురళీ స్వామి నంబూద్రి మన హైదరాబాద్‌కు చెందినవారు కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. 

30 ఏళ్లుగా సోమాజిగూడ ఆలయంలో సేవలు

మురళీ స్వామి స్వగ్రామం కేరళ రాష్ట్రం గురువయార్ సమీపంలోని అంజూరు గ్రామం. ఆయన తల్లిదండ్రులు గోవింద్ నంబూద్రి, ఉమాదేవి. ఆయన ఇంటర్ వరకు మాత్రమే విద్యను అభ్యసించారు. ఆ తర్వాత 1993లో తెలిసినవాళ్లు వాసుదేవ్ నంబూద్రి ద్వారా నగరంలోని సోమాజిగూడ అయ్యప్ప దేవాలయం ప్రతిష్టాప న కోసం నగరానికి వచ్చారు. ఆ తర్వాత ప్రతిష్ట చేసిన దేవాలయానికే ప్రధాన అర్చకులుగా (మేల్శాంతి)గా కొనసాగుతున్నారు.

అప్పటినుంచి పుట్టిన ఊరు, తల్లిదండ్రులను వదిలి నగరంలోని సోమాజిగూడ అయ్యప్పస్వామి దేవాలయంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కేరళా విధానపరమైన పూజా పద్దతులు, తంత్రి నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో నంబూద్రి వంశీకులకు మాత్రమే అవకాశం ఉండే శబరిమల అయ్యప్ప దేవాలయంలో ప్రధాన పూజారిగా పూజలు అందించాలనే దృఢ సంకల్పంతో ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

మూడో ప్రయత్నంలో ఎంపిక.. 

సోమాజిగూడ అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రధాన పూజారిగా ఉన్న మురళీ స్వామి నంబూద్రి శబరిమలలోని అయ్యప్ప టెంపుల్‌కు మేల్శాంతిగా పనిచేయాలనే ఆకాంక్ష, పట్టుదలతో వరుసగా మూడేళ్లు ప్రయత్నించారు. మొదటి ఏడాది ఇంట ర్వ్యూ దాకా వెళ్లారు. రెండో ఏడాది లాటరీ దాకా వెళ్లినా వెనుతిరగాల్సి వచ్చింది. మూడో దఫా 2023లో మరో మారు ప్రయత్నించి.. ప్రధాన పూజారిగా ఎంపికయ్యారు.

2023 నవంబరు 16 నుంచి 2024 నవంబరు 16 వరకూ ఏడాది కాలం శబరిమలలో అయ్యప్ప దేవాలయంలోని మాళికపురత్తమ దేవాలయానికి ప్రధాన అర్చకులుగా వ్యవహరించారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన శబరిమల అయ్యప్ప దేవాలయంలో హైదరాబాద్‌కు చెందిన మురళి స్వామి ప్రధాన పూజారిగా వ్యవహరించడం తెలుగు రాష్ట్రాలలో తొలి వ్యక్తిగా నిలిచిపోతారు. 

ప్రకృతికి అంకితం కావడమే

అయ్యప్ప స్వాములు శబరిమల దర్శనానికి రావడానికి 41 రోజుల పాటు కఠోరమైన దీక్ష చేస్తారు. చెప్పులు లేకుండా నేలమీద నడవటం, బ్రహ్మ ముహుర్తం నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభించడం ఇలాంటి రకమైన పూజా విధానం ప్రపంచంలో మరెక్కడా ఉండదు. అయ్యప్ప మాల ధరించడం అంటే ప్రకృతితో కలిసి జీవించడం, ప్రకృతికి అంకితం కావడమే. అంతటి గొప్ప అయ్యప్ప ఆలయంలో ఏడాది పాటు మేల్శాంతి (ప్రధాన పూజారి)గా సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తాను.  సోమాజిగూడ అయ్యప్ప దేవాలయంలోనూ శబరిమలలో జరిగే పూజా విధానమే పాటిస్తాం.

 మురళీస్వామి నంబూద్రి